china: మరణానికి కారణం ‘కరోనా’ అని రాయొద్దు.. డెత్ సర్టిఫికెట్ల విషయంలో డాక్టర్లకు చైనా ఆదేశాలు
- దేశంలో వైరస్ మరణాలను తగ్గించి చూపేందుకు ప్రయత్నం
- రోగి మరో వ్యాధితో బాధపడితే దానినే మరణానికి కారణంగా పేర్కొనాలని సూచన
- ఆసుపత్రులలో చనిపోతేనే కరోనా లెక్కల్లోకి చేర్చాలని ఆదేశం
చైనాలో కరోనా మహమ్మారి కారణంగా లక్షలాది మంది చనిపోతున్నారు. ఆ దేశంలోని పరిస్థితిపై ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా మరణాలపై జిన్ పింగ్ సర్కారు దేశంలోని ఆసుపత్రులకు పలు సూచనలు చేసింది. వైరస్ మరణాలను తగ్గించి చూపేందుకు డెత్ సర్టిఫికెట్లలో మరణానికి కారణం కరోనా అని రాయడం వీలైనంత వరకు తగ్గించాలని పేర్కొంది.
ఆసుపత్రుల యాజమాన్యాలు ఈమేరకు తమ వైద్యులకు సూచనలు జారీచేశాయి. మరణానికి కారణాన్ని నిర్ధారించే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని నోటీసులు జారీ చేస్తున్నాయి. మరణించిన వారికి కరోనాతో పాటు మరో వ్యాధి ఉంటే.. ఆ రెండో వ్యాధి వల్లే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆసుపత్రులు ఆదేశిస్తున్నాయి. వైరస్ తో ఆసుపత్రులలో చనిపోయిన వారికి తప్ప మిగతా మరణాలకు కరోనాతో చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇవ్వొద్దని ప్రభుత్వం స్పష్టంచేసింది.
మరణానికి కారణం కరోనానే అని వైద్యులు గట్టిగా నమ్ముతున్న సందర్భాలలో కూడా వెంటనే సర్టిఫికెట్ తయారుచేయొద్దని ఆసుపత్రుల నిర్వాహకులు వైద్యులకు సూచిస్తున్నారు. ఆ విషయాన్ని తన పైఅధికారులకు రిపోర్టు చేయాలని, ఆ కేసును నిపుణులు మరోసారి పరీక్షించిన తర్వాతే డెత్ సర్టిఫికెట్ జారీ చేయాలని తమకు ఆదేశాలు అందినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ ఆదేశాలకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదని అంటున్నారు.
ఇప్పటి వరకు కరోనా మరణాలపై నోరు మెదపని చైనా.. కిందటి నెలలో కరోనా వల్ల 60 వేల మంది చనిపోయారని ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. గత డిసెంబర్ 8 నుంచి జనవరి మొదటి వారం వరకు దేశవ్యాప్తంగా 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ఇందులో 54,435 మంది కరోనాతో పాటు ఇతర వ్యాధుల కారణంగా చనిపోగా, 5,503 మంది కరోనాతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడి కన్నుమూశారని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది.