Team India: హైదరాబాద్‌లో నేడు భారత్-కివీస్ పోరు.. మీరు వెళ్తుంటే వీటిని తీసుకెళ్లొద్దు!
- మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే
- మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్
- 12 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతి
- ఎలక్ట్రానిక్ పరికరాలను స్టేడియంలోకి అనుమతించబోమన్న పోలీసులు
- 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసుకున్న వారు స్టేడియానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.
మొబైల్ ఫోన్లను తప్ప ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని రాచకొండ పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరే ముందే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మాత్రమే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామన్నారు. కాగా, మ్యాచ్ నేపథ్యంలో 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీంలను స్టేడియం వద్ద మోహరించారు. అలాగే, క్విక్ రియాక్షన్ బృందాలను కూడా రంగంలోకి దింపారు. బ్లాక్ టికెట్లు, బెట్టింగ్‌పైనా నిఘా పెట్టారు.