Thiruvairanikulam Mahadeva temple: నటి అమలాపాల్‌కు చేదు అనుభవం.. ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరణ!
- ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయాన్ని సందర్శించిన అమలాపాల్
- దర్శనానికి వెళ్లకుండా అడ్డుకున్న అధికారులు
- సందర్శకుల రిజిస్టర్‌లో తన అనుభవాన్ని రాసిన నటి
- అందరినీ సమానంగా చూసే రోజు వస్తుందని ఆశాభావం
ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలో హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అన్యమతస్తులకు ప్రవేశం లేదు. ఈ నేపథ్యంలో ఆలయ సందర్శనకు వచ్చిన ప్రముఖ నటి అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లకుండా అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో రాసుకొచ్చారు.
తాను అమ్మవారిని చూడలేకపోయినా ఆత్మను అనుభవించానని అమలాపాల్ ఆ రిజిస్టర్‌లో రాశారు. 2023లోనూ మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలోకి తనను అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు పేర్కొన్నారు. తాను ఆలయంలోకి వెళ్లలేకపోయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించానని, మతపరమైన వివక్షలో త్వరలోనే మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. మతం ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూసే సమయం వస్తుందని ఆశిస్తున్నట్టు రిజిస్టర్‌లో అమలాపాల్ రాసుకొచ్చారు.