Palbociclib: ప్రపంచంలోనే తొలిసారి.. ట్యాబ్లెట్ల రూపంలో రొమ్ము కేన్సర్ జెనరిక్ ఔషధం!
- ఇప్పటి వరకు క్యాప్సూల్స్ రూపంలో అందుబాటులో ఉన్న ‘పాల్బోసిక్లిబ్’
- తొలిసారి ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చిన హైదరాబాద్ కంపెనీ
- 75 ఎంజీ ట్యాబ్లెట్ ధర రూ. 214.29 మాత్రమే
ప్రపంచంలోనే తొలిసారి రొమ్ము కేన్సర్ ఔషధం ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ఎన్ గ్రూప్ ఈ మాత్రలను విడుదల చేసింది. రొమ్ము కేన్సర్ చికిత్సలో ఉపయోగించే ‘పాల్బోసిక్లిబ్’ ట్యాబ్లెట్లను 75, 100, 125 ఎంజీ స్థాయుల్లో తీసుకొచ్చింది. జనరిక్ పాల్బోసిక్లిబ్ ఔషధాన్ని ట్యాబ్లెట్ల రూపంలో తీసుకొచ్చిన తొలి కంపెనీ తమదేనని ఈ సందర్భంగా ఎంఎస్ఎన్ గ్రూప్ పేర్కొంది.
ఇప్పటి వరకు ఈ ఔషధం క్యాప్సూల్స్ రూపంలో అందుబాటులో ఉంది. ఇప్పుడీ కంపెనీ మాత్రల రూపంలో తీసుకొచ్చింది. మాత్రల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఎంఎస్ఎన్ తెలిపింది. ఆహారం తీసుకోకుండా కూడా వీటిని వేసుకోవచ్చని పేర్కొంది. ‘ఫాల్బోరెస్ట్’ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న పాల్బోసిక్లిబ్ ట్యాబ్లెట్ల ధరలు వరుసగా రూ. 214.29 (75 ఎంజీ), రూ.233.28 (100ఎంజీ), రూ. 257.14 (125ఎంజీ)గా ఉన్నాయి.