Satish Dhawan Space Centre: సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో కలకలం.. 24 గంటల వ్యవధిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆత్మహత్య

Two Police Committed Suicide in SHAR Span of 24 Hours

  • ఆదివారం ఒకరు, సోమవారం ఒకరు ఆత్మహత్య
  • ఇద్దరూ సీఐఎస్ఎఫ్‌కు చెందిన వారే
  • ఒకరిది యూపీ, మరొకరిది చత్తీస్‌గఢ్

తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో 24 గంటల వ్యవధిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వీరిద్దరూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సీఐఎస్ఎఫ్) చెందినవారు. వీరిలో ఒకరిది చత్తీస్‌గఢ్ కాగా, మరొకరిది ఉత్తరప్రదేశ్. చత్తీస్‌గఢ్‌లోని మహాసమంద్ జిల్లా శంకర గ్రామానికి చెందిన చింతామణి (29) 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలో విధుల్లో చేరాడు. ఇటీవల నెల రోజులపాటు సెలవుపై ఇంటికెళ్లిన చింతామణి ఈ నెల 10న తిరిగొచ్చి విధుల్లో చేరాడు.

షార్‌లోని పీసీఎంసీ రాడార్-1 ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట షిఫ్ట్‌కు హాజరయ్యాడు. రాత్రి 7.30 గంటలకు కంట్రోల్‌ రూముతోనూ మాట్లాడాడు. అంతలో ఏమైందో కానీ ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యవసర భద్రతా దళ (క్యూ ఆర్టీ) సిబ్బంది రాత్రి 8.30 గంటలకు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో చింతామణి ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సమస్యలతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్థారించారు.

ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా కాకముందే ఎస్సై తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. షార్ మొదటి గేటు వద్ద కంట్రోల్ రూములో విధుల్లో ఉన్న ఎస్సై వికాస్ సింగ్ తన తుపాకితో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకి పేలుడు శబ్దం వినిపించడంతో పరుగున అక్కడికి వెళ్లిన సహచరులకు వికాస్ సింగ్ రక్తపు మడుగులో కనిపించాడు. 30 ఏళ్ల వికాస్ సింగ్‌ది ఉత్తరప్రదేశ్. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News