Chandigarh: శునకాల ఆకలి తీరుస్తున్న యువతిపైకి దూసుకెళ్లిన కారు
- చండీగఢ్ లో జరిగిన ఘటన
- యువతికి తీవ్ర గాయాలు
- సీసీటీవీ కెమెరాలో రికార్డ్
- పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి తండ్రి
వీధి కుక్కలకు ఆహారం వేయడం మనలో చాలా మంది చేసే పని. మిగిలిపోయిన ఆహారాన్ని వాటి కోసం రోడ్డు పక్కన వేస్తుంటాం. కొందరు తాజా ఆహారాన్ని, బిస్కెట్లు, బ్రెడ్ ను కూడా ఆహారంగా వేస్తుంటారు. ఇలానే ఓ యువతి వీధి శునకాలపై ప్రేమతో, తన ప్రాణానికి ప్రమాదం తెచ్చుకుంది.
చండీగఢ్ లో తేజస్విత (25) అనే యువతి తన ఇంటికి సమీపంలో రహదారి పక్కన కుక్కలకు ఆహారం వేస్తోంది. అదే సమయంలో ఓ కారు పక్క రహదారి నుంచి యూ టర్న్ తీసుకుని వేగంగా ఆమెపైకి, శునకంపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో తేజస్విత కింద పడిపోగా, శునకం అక్కడి నుంచి పరారైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలకు గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు.
యువతిపైకి కారు దూసుకెళ్లడం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో తేజస్విత తండ్రి ఓజస్వి కౌశల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ఆర్కిటెక్చర్ డిగ్రీ చదివి, యూపీఎస్ సీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నట్టు తెలిపారు. తన భార్య, కుమార్తె రోజూ మార్కెట్ కు వెళ్లి వీధి కుక్కలకు ఆహారం వేస్తుంటారని చెప్పారు. మనం వీధుల్లోకి వెళ్లినప్పుడు, రహదారులపై ఆగినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన తెలియజేస్తోంది.