Team India: ఇలా చేస్తే సచిన్ శత శతకాల రికార్డును విరాట్ బ్రేక్ చేయగలడు: గవాస్కర్
- వన్డేల్లో 46వ సెంచరీ సాధించిన విరాట్
- అన్ని ఫార్మాట్లలో కలిపి 74 శతకాలకు చేరువ
- మరో ఐదారేళ్లు ఆడితే సచిన్ శత శతకాలను అందుకుంటాడని సన్నీ వ్యాఖ్య
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ మళ్లీ తన టాప్ గేర్ లోకి వచ్చేశాడు. ముఖ్యంగా ఎన్నో రికార్డులు నెలకొల్పిన వన్డే క్రికెట్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గతేడాది ఆడిన తన చివరి వన్డేలో బంగ్లాదేశ్ పై శతకం సాధించిన విరాట్ అదే జోరును శ్రీలంకతో వన్డే సిరీస్ లోనూ కొనసాగించాడు. లంకతో మూడు వన్డేల్లో రెండు శతకాలతో చెలరేగిపోయాడు. దాంతో, ఈ ఫార్మాట్ లో తన సెంచరీల సంఖ్యను 46కి పెంచుకున్నాడు. వన్డేల్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల (49) రికార్డును అందుకునేందుకు చేరువయ్యాడు. అతను ఇదే జోరును కొనసాగిస్తే మరో మూడు సెంచరీలు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును సులువుగా అధిగమించేలా ఉన్నాడు.
అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ వంద శతకాల (టెస్టు, వన్డే, టీ20) ఘనతనూ విరాట్ అందుకునే అవకాశం ఉందని మరో దిగ్గజం సునీల్ గవాస్కర్ అంటున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ 74 శతకాలు సాధించాడు. విరాట్ పరుగుల దాహంతో మరికొన్నేళ్లు ఆడితే ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉందన్నాడు. 34 ఏళ్ల విరాట్ ఇంకో ఐదారేళ్లపాటు ఆడి, ఏడాదికి ఆరు సెంచరీల చొప్పున రాబడితే శత శతకాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు. సచిన్ 40 ఏళ్ల వరకు క్రికెట్ కొనసాగించాడని, అతని అత్యున్నత ఘనత అందుకోవాలంటే కోహ్లీ సైతం తన 40వ ఏట వరకు ఆడాల్సి ఉందన్నాడు. ఫిట్ నెస్ విషయంలో విరాట్ చాలా స్పష్టతతో ఉంటాడని సన్నీ అభిప్రాయపడ్డాడు.