KTR: నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు.. దావోస్ చేరుకున్న కేటీఆర్
- ప్రవాస భారతీయుల సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్
- దావోస్ వచ్చిన ప్రతిసారి ప్రవాస భారతీయుల నుంచి గొప్ప మద్దతు లభిస్తోందన్న కేటీఆర్
- కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో సాగుతోందన్న మంత్రి
- నేటి నుంచి ఐదు రోజులపాటు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు
స్విట్జర్లాండ్‌లో జరగనున్న ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు తెలుగు వారి నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తాను దావోస్ వచ్చిన ప్రతిసారి ప్రవాస భారతీయుల నుంచి లభిస్తున్న మద్దతు గొప్పగా ఉంటోందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా, పట్టణాలుగా గుర్తింపు పొందాయన్నారు. అనంతరం వారు నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ వారికి ధన్యవాదాలు తెలిపారు.
కాగా, దావోస్‌లో నేడు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రారంభం అవుతుంది. ‘విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం’ అనే అంశంపై ఈ సదస్సు జరగనుంది. 52 దేశాల అధినేతలు, 130 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు హాజరవుతారు. భారత్ నుంచి కేంద్రమంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, అశ్వినీ వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, పలువురు సీఎంలు, కేటీఆర్, ఇతర ప్రతినిధులు హాజరవుతున్నారు.