Team India: తిరువనంతపురం వన్డేలో భారత్ కొల్లగొట్టిన రికార్డులివే!
- నిన్నటి మ్యాచ్‌లో రికార్డుల హోరు
- కోహ్లీ ఖాతాలోకి వచ్చిన చేరిన పలు రికార్డులు
- జట్టు ఖాతాలోనూ బోల్డన్ని రికార్డులు
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న శ్రీలంకతో తిరువనంతపురంలో జరిగిన వన్డేలో భారత జట్టు పలు రికార్డులు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో శుభమన్ గిల్ (116), విరాట్ కోహ్లీ (166 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడడంతో టీమిండియా తొలుత 390 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 73 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 317 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది.
ఈ విజయంతో భారత జట్టు సొంతమైన రికార్డులు ఇవే..
* సొంతగడ్డపై కోహ్లీ అత్యధిక సెంచరీలు (21) సాధించాడు. ఈ క్రమంలో 20 శతకాలతో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సచిన్‌ను అధిగమించాడు.
* కోహ్లీకి ఇది రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు (166 నాటౌట్). 2012లో మీర్పూరులో జరిగిన ఆసియాకప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ 183 పరుగులు సాధించాడు.
* వన్డేల్లో ఒక ప్రత్యర్థిపై 10 సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. వెస్టిండీస్‌పై కోహ్లీ 9 సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ 9 సెంచరీలు చేశాడు.
* శ్రీలంకపై భారత్ 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. 2008లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడా రికార్డు బద్దలైంది.
* ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ 32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడి కెరియర్‌లో ఇదే అత్యుత్తమం. అంతకుముందు విండీస్‌పై 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.
* తాజా ఇన్నింగ్స్‌తో వన్డేల్లో 5 సార్లు 150కి పైగా పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, క్రిస్ గేల్ సరసన కోహ్లీ చేరాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (8సార్లు), డేవిడ్ వార్నర్ (6సార్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
* ఈ సిరీస్‌లో శ్రీలంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో వరుసగా మూడోసారి సిరాజ్ చేతిలో అవుటయ్యాడు.
* వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఐదో క్రికెటర్‌గా కోహ్లీ (12,754) రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో మహేల జయవర్ధనే (12,650)ను అధిగమించాడు. 18,426 పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
* వన్డేల్లో శ్రీలంకకు ఇది నాలుగో అత్యల్ప స్కోరు (73), 2012లో దక్షిణాఫ్రికాపై 43 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్‌పై 55, ఇంగ్లండ్‌పై 67 పరుగులకు ఆలౌట్ అయింది.
* 106 బంతుల్లోనే కోహ్లీ 150 పరుగులు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 103 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
* ఈ మ్యాచ్‌లో కోహ్లీ 8 సిక్సర్లు కొట్టాడు. కోహ్లీ ఓ ఇన్నింగ్స్‌లో కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2013లో జైపూర్‌లో ఆస్ట్రేలియాపై 7 సిక్సర్లు బాదాడు.
* శ్రీలంకపై ఇండియాకు ఇది (390/5) నాలుగో అత్యుత్తమ స్కోరు. గతంలో రాజ్‌కోట్‌లో 414/7, కోల్‌కతాలో 404/5, మొహాలీలో 392/4 పరుగులు చేసింది.
* శ్రీలంకపై 21 సార్లు 50కి పైగా పరుగులు చేసిన కోహ్లీ ధోనీతో కలిసి రెండో స్థానాన్ని పంచుకుంటున్నాడు. 25 సార్లు ఈ ఘనత సాధించిన టెండూల్కర్ ఈ జాబితాలో ముందున్నాడు.
* శ్రీలంకపై 2053 పరుగులు సాధించిన కోహ్లీ.. ధోనీని అధిగమించి రెండో స్థానానికి ఎగబాకాడు. 3,113 పరుగులతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజిమాముల్ హక్ శ్రీలంకపై 3,824 పరుగులు చేయగా, 3,927 పరుగులతో ఇంజీని కోహ్లీ అధిగమించాడు. 5,108 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు.