Yash Chawde: పిల్లాడు కాదు పిడుగు... 40 ఓవర్ల మ్యాచ్ లో 508 పరుగులు చేసిన 13 ఏళ్ల బాలుడు
- నాగపూర్ లో అంతర్ పాఠశాలల క్రికెట్
- సరస్వతి విద్యాలయ తరఫున బరిలో దిగిన యశ్ చౌదే
- 178 బంతుల్లో 508 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన వైనం
- 81 ఫోర్లు, 18 సిక్సర్లతో వీర విజృంభణ
యశ్ చౌదే అనే బాలుడి పేరు ఇప్పుడు జాతీయస్థాయిలో మార్మోగుతోంది. యశ్ చౌదే ఓ జూనియర్ క్రికెటర్. వయసు 13. అయితేనేం, పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు ఓ అండర్-14 విభాగం మ్యాచ్ లో పరుగుల సునామీ సృష్టించాడు. రికార్డుస్థాయిలో తానొక్కడే 508 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దేశంలో అంతర్ పాఠశాలల రికార్డులో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
ముంబయి ఇండియన్స్ నిర్వహిస్తున్న అంతర్ పాఠశాలల క్రికెట్ టోర్నీలో భాగంగా నాగపూర్ లో సరస్వతి విద్యాలయ, సిద్ధేశ్వర్ విద్యాలయ జట్ల మధ్య ఈ అరుదైన ఇన్నింగ్స్ ఆవిష్కృతమైంది. ఈ 40 ఓవర్ల మ్యాచ్ లో సరస్వతి విద్యాలయ తొలుత బ్యాటింగ్ చేసింది.
సరస్వతి విద్యాలయ టీమ్ తరఫున ఓపెనర్ గా బరిలో దిగిన యశ్ చౌదే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 178 బంతుల్లో 508 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అందులో 81 ఫోర్లు, 18 సిక్సులున్నాయంటే ఆ కుర్రాడి విజృంభణకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఎంతగా విలవిల్లాడారో అర్థం చేసుకోవచ్చు. సెంచరీ సాధించడమే కష్టమనుకుంటే, ఒకే ఇన్నింగ్స్ లో 500కి పైగా పరుగులు చేయడం అద్భుతం.
యశ్ చౌదే భారీ ఇన్నింగ్స్ సాయంతో సరస్వతి విద్యాలయ నిర్ణీత 40 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 714 పరుగులు చేసింది. మరో ఓపెనర్ తిలక్ వకోడే 97 బంతుల్లో 127 పరుగులు చేశాడు. అనంతరం, సిద్ధేశ్వర్ విద్యాలయ మరీ దారుణంగా 5 ఓవర్లలో 9 పరుగులకే ఆలౌట్ అయింది.
కాగా, ఈ ఇన్నింగ్స్ తో యశ్ చౌదే అంతర్జాతీయ రికార్డుల్లో స్థానం దక్కించుకున్నాడు. శ్రీలంకకు చెందిన చరిత్ సెల్లెపెరుమ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ లో 500కి పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా అవతరించాడు. గతేడాది ఆగస్టులో సెల్లెపెరుమ ఓ మ్యాచ్ లో 553 పరుగులు సాధించాడు.
ఇక, అన్ని ఫార్మాట్లలో చూస్తే ఇప్పటివరకు 10 మంది మాత్రమే 500కి పైచిలుకు పరుగులు సాధించారు. వారిలో ఐదుగురు భారత్ ఆటగాళ్లే. ప్రణవ్ ధనవాడే (1009 నాటౌట్), ప్రియాన్షు మోలియా (556 నాటౌట్), పృథ్వీ షా (546), దాదీ హవేవాలా (515) ఇప్పటిదాకా ఈ జాబితాలో ఉండగా, ఇప్పుడు యశ్ చౌదే (508 నాటౌట్) కూడా వారి సరసన చేరాడు.