Cricket: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ జట్టు
- పాకిస్థాన్ గడ్డపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ కైవసం
- మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో గెలుపు
- 2–1తో సిరీస్ సొంతం చేసుకున్న కివీస్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్ గడ్డపై తొలిసారి వన్డే ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. పాక్ తో శుక్రవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో కివీస్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు వన్డేల సిరీస్ ను 2–1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ 10 ఫోర్లు, 1 సిక్స్ తో 101 పరుగులతో సెంచరీతో రాణించాడు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 77 పరుగులతో సత్తా చాటాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసి గెలిచింది. గ్లెన్ ఫిలిప్స్ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 63 పరుగులతో చెలరేగగా, డెవాన్ కాన్వే 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులతో సత్తా చాటాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 53 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో అఘా సల్మాన్, మొహమ్మద్ వాసిం చెరో రెండు వికెట్లు పడగొట్టారు. గ్లెన్ ఫిలిప్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవగా, డెవాన్ కాన్వే కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.