Harish Rao: 10వ తరగతి విద్యార్థులను ఫోన్లకు దూరంగా ఉంచండి: హరీశ్ రావు
- పిల్లలకు చదువుపై ఆసక్తి పెరిగేలా చూడాలని తల్లిదండ్రులకు హరీశ్ సూచన
- పదో తరగతి 10 జీపీఏ సాధించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ. 10 వేల బహుమానం ఇస్తానన్న మంత్రి
- 100 శాతం ఉత్తీర్ణత సాధించే పాఠశాలలకు రూ. 25 వేలు ఇస్తామని వ్యాఖ్య
పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు వారికోసం సమయాన్ని కేటాయించాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్ధిపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిందండ్రులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు బాగా ఆకర్షితులవుతారని, వారు ఫోన్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలను తీసుకోవాలని చెప్పారు. సిద్ధిపేట కలెక్టరేట్ లో హరీశ్ రావు ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
10వ తరగతి ఉత్తీర్ణతలో తెలంగాణలో సిద్ధిపేట జిల్లా తొలి స్థానంలో నిలిచిందని, ఈ సారి కూడా తొలి స్థానంలో నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పారు. పదికి పది జీపీఏ తెచ్చుకునే విద్యార్థులకు రూ. 10 వేల బహుమానం ఇస్తానని, 100 శాతం ఉత్తీర్ణత సాధించే పాఠశాలలకు రూ. 25 వేలు బహుమతిగా ఇస్తానని తెలిపారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించడానికి కావాల్సిన చర్యలన్నీ చేపట్టాలని హెడ్మాస్టర్లను మంత్రి ఆదేశించారు.