Ambati Rambabu: మంత్రి అంబటిపై కేసు నమోదు చేయండి: గుంటూరు జిల్లా కోర్టు
- లక్కీడ్రా టికెట్ల అమ్మకానికి సంబంధించి మంత్రిపై ఆరోపణలు
- అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేత కోర్టులో పిటిషన్
- విచారణ తర్వాత మంత్రిపై కేసు పెట్టాల్సిందేనన్న కోర్టు
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. సంక్రాంతి డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అమ్మించి, డబ్బు దండుకున్నారని మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు వెంకటేశ్వరరావు పిల్ ను మంగళవారం విచారించిన కోర్టు.. మంత్రి రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
లక్కీ డ్రా పేరుతో మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో టికెట్లను బలవంతంగా అంటగడుతూ వసూళ్లకు పాల్పడ్డారని జనసేన ఆరోపించింది. దీంతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో, జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. గతంలోనూ మంత్రి అంబటిపై జనసేన నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. కొడుకు చనిపోయిన బాధితురాలికి ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారంలో మంత్రి వాటా అడిగారని ఆరోపించారు.