Jalebi Baba: 120 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన 'జిలేబీ బాబా'
- మహిళలపై అత్యాచారాలను చిత్రీకరించిన కీచకబాబా
- వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ అత్యాచారాలు
- 2019లో అరెస్ట్.. దోషిగా తేల్చిన కోర్టు
హర్యానాలో అమర్ వీర్ (63) అనే కీచకుడు 120 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్టు కోర్టులో రుజువైంది. ఫతేహాబాద్ జిల్లా తొహానా పట్టణానికి చెందిన అమర్ వీర్ ఒక కీచక బాబా. అతడిని అందరూ జిలేబీ బాబా అని పిలుస్తారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడడమే కాదు, తన అఘాయిత్యాలను వీడియో తీసి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ పదేపదే అత్యాచారాలకు పాల్పడేవాడని కోర్టు గుర్తించింది.
అత్యాచారానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో జిలేబీ బాబాను పోలీసులు 2019 జులై 19న అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో 120 వీడియో క్లిప్పింగ్ లు బయటపడ్డాయి. ప్రతి వీడియోలో వేర్వేరు మహిళలు ఉన్నారు. అతడు తన మొబైల్ ఫోన్ తో అత్యాచారకాండను వీడియో తీసేవాడు.
అమర్ వీర్ కు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య చనిపోయింది. 23 ఏళ్ల కిందట పంజాబ్ లోని మాన్సా పట్టణం నుంచి హర్యానాలోని తొహానా వలస వచ్చాడు. 13 ఏళ్ల పాటు అతడు ఓ జిలేబీ దుకాణం నడిపాడు. ఆ సమయంలో ఓ తాంత్రికుడితో పరిచయం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. క్షుద్రపూజలపై ఆసక్తి చూపాడు.
ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయాడు. కొన్నాళ్ల తర్వాత తిరిగొచ్చి ఓ ఆలయం, దాని పక్కనే ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ్నించి తనను తాను బాబాగా చెప్పుకుంటూ, పలువురు భక్తులను తయారుచేసుకున్నాడు. వారిలో చాలామంది మహిళలే.
2018లో ఓ పరిచయస్తుడి భార్యపై గుడిలో అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే జిలేబీ బాబాకు ఈ కేసులో బెయిల్ లభించింది. అయితే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో అతడి పాపం పండింది. కోర్టులో అతడి నేరాలు నిరూపితమయ్యాయి. కోర్టు అతడికి శిక్ష విధించనుంది.