body pains: శీతాకాలంలో వళ్లు నొప్పులకు కారణాలేంటి?

Why you are experiencing body pain in winter

  • ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడమే సమస్యలకు మూలం
  • శారీరక కదలికలు లేని వారిలోనే సమస్యలు ఎక్కువ
  • వ్యాధి నిరోధక శక్తి బలహీన పడే ప్రమాదం

మన శరీరంలో ఉండే సహజ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. కానీ, శీతాకాలంలో మన శరీర ఉష్ణోగ్రత కంటే బయటి ఉష్ణోగ్రత చాలా తక్కువ స్థాయికి చేరుతుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో రాత్రుళ్లు 8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది. అంటే మన శరీర సహజ ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువ ఉందని అర్థం చేసుకోవచ్చు.

ఇలా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయినప్పుడు శరీరంలో చురుకుదనం క్షీణిస్తుంది. చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, జాయింట్ల సమస్యలున్న వారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఈ కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా జాయింట్లలో, కండరాల్లో నొప్పులు వేధిస్తుంటాయి. 

ఈ కాలంలో శారీరక కదలికలు తగ్గిపోవడం సమస్యలకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కదలికలు తగ్గడం వల్ల వళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, నరాల నొప్పులు కనిపిస్తాయంటున్నారు. మనం శారీరక వ్యాయామం చేయనప్పుడు శరీరం గట్టిగా బిగుసుకుని ఉంటుంది. ఇదే సమస్యకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. వెన్నెముక నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి బాధిస్తాయని అంటున్నారు.

కనుక ఈ కాలంలో ఎలాంటి నొప్పులు అయినా కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలి వాతావరణం నుంచి శరీరానికి తగినంత రక్షణ ఇవ్వడం అవసరమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. తక్కువ ఉష్ణోగ్రతలతో కీళ్లలోని ఫ్లూయిడ్ మందంగా మారి గట్టిపడుతుంది. దీనికితోడు ఇళ్లల్లోనే ఉండిపోవడం, కదలికలు తగ్గిపోవడం సమస్యలకు కారణమని కార్డియో మెటబాలిక్ ఇనిస్టిట్యూట్ సైతం అంటోంది.

శీతాకాలంలో పగటి పూట సమయం తక్కువ. రాత్రి సమయం ఎక్కువ. దీంతో సూర్యరశ్మి ప్రభావం తక్కువగా ఉంటుంది. చలి పెరిగిపోవడానికి ఇది కూడా ఒక కారణం. అంతేకాదు మనకు డీ విటమిన్ కూడా లోపిస్తుంది. విటమిన్ డీ లోపిస్తే ఎముకల ఆరోగ్యం బలహీనపడడమే కాదు, వ్యాధి నిరోధక శక్తి కూడా క్షీణిస్తుంది. కనుక వైద్యుల సూచనతో విటమిన్ డీ సప్లిమెంట్లను పెంచుకోవాలి.

ముఖ్యంగా చిన్న పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు, ఆర్థరైటిస్ తదితర సమస్యలున్నవారు చలి నుంచి రక్షణగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామాలు రోజులో 40 నిమిషాల పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం.

  • Loading...

More Telugu News