Vasantha Krishna Prasad: రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా? అని అనిపిస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

Vasantha Krishna Prasad commens on present politics
  • తమ కుటుంబం 55 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందన్న కృష్ణప్రసాద్
  • 10 మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగితేనే నాయకుడిగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉందని వ్యాఖ్య 
  • సేవా కార్యక్రమాలను చేసే వారిని ఆపడం మంచిది కాదని సూచన 
  తమ కుటుంబం గత 55 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, తాను పుట్టినప్పటి నుంచీ తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు చాలా మారిపోయాయని అన్నారు. పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగితేనే నాయకుడిగా ముందుకు సాగే పరిస్థితి ఉందని... అది చేతకాక తాను పాత తరం నాయకుడిగానే మిగిలిపోయానని చెప్పారు. 

గత మూడున్నరేళ్ల కాలంలో ఒక్కరిపై కూడా తాను అక్రమ కేసులు పెట్టించలేదని... ఈ విషయంలో తనపై తమ పార్టీలోని కొందరు నేతలకు అసంతృప్తి ఉండొచ్చని అన్నారు. రౌడీలను వెంటేసుకుని ఇతర ఎమ్మెల్యేల మాదిరి ప్రవర్తిస్తేనే రాజకీయాల్లో ముందడుగు వేసేలా పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా, ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని ఒక్కోసారి అనిపిస్తుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా సాటి వ్యక్తులకు సాయం చేయలేకపోతున్నానని చెప్పారు. రైతుల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని... వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

గుంటూరులో ఇటీవల నిర్వహించిన టీడీపీ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై ఆయన స్పందిస్తూ... సేవాకార్యక్రమాలను చేసే వారిని విమర్శించడం సరికాదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకునే ఎన్నారైలను ఆపడం మంచి పద్ధతి కాదని చెప్పారు. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి స్నేహితుడని, చాలా మంచి వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తిపై ఏవేవో చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని.. తొక్కిసలాట ఘటనను చిలవలు, పలవలు చేసి చూడటం సరికాదని అన్నారు.
Vasantha Krishna Prasad
YSRCP
Jagan

More Telugu News