adani: మోదీ నుంచి వ్యక్తిగతంగా ఏ సాయం అందదు: అదానీ
- ప్రధాని వల్లే తన ఆస్తులు పెరుగుతున్నాయన్న ఆరోపణలపై గౌతమ్ అదానీ వివరణ
- దేశంలోని 22 రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నాం.. అన్నిరాష్ట్రాల్లో బీజేపీ లేదని వెల్లడి
- గత ఏడెనిమిదేళ్లలో అదానీ గ్రూప్ ఆదాయం 24 శాతం, అప్పులు 11 శాతం పెరిగాయన్న చైర్మన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి వ్యక్తిగతంగా తనకెలాంటి సాయం అందదని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రధానితో మాట్లాడొచ్చు కానీ పాలసీ అంటూ రూపొందడం జరిగిందంటే అది అందరికోసమే తప్ప అదానీ గ్రూప్ కోసం మాత్రమే కాదని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీతో సాన్నిహిత్యం వల్లే అదానీ గ్రూప్ ఆస్తులు పెరిగాయనే ఆరోపణలపై ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో అదానీ గ్రూప్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అదానీ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదని ఆయన గుర్తుచేశారు. వామపక్ష పార్టీ అధికారంలో ఉన్న కేరళలో, మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న బెంగాల్ లో, నవీన్ పట్నాయక్ పాలనలో ఉన్న ఒడిశాలో, జగన్ మోహన్ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలోనూ అదానీ గ్రూప్ సంస్థల వ్యాపారం కొనసాగుతోందని అదానీ చెప్పారు.
ప్రపంచ ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ తమ కంపెనీల లాభనష్టాల వివరాలనూ ఈ సందర్భంగా క్లుప్తంగా వివరించారు. గత ఏడెనిమిదేళ్లలో అదానీ గ్రూప్ ఆదాయం 24 శాతం పెరిగిందని చెప్పారు. అదే సమయంలో తమ కంపెనీల రుణాలు 11 శాతం పెరిగాయని వివరించారు. తన జీవితంలో మూడు పెద్ద బ్రేక్ లు వచ్చాయని అదానీ వివరించారు.
1985లో రాజీవ్ గాంధీ పాలన సమయంలో ఎక్జిమ్ పాలసీ ద్వారా అదానీ గ్రూప్ గ్లోబల్ ట్రేడింగ్ హౌస్ గా మారినట్లు చెప్పారు. రెండో బ్రేక్.. 1991లో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల ఆర్థిక సంస్కరణల ద్వారా అదానీ గ్రూప్ పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్య విధానంలోకి వచ్చినట్లు వివరించారు. ఇక మూడోది.. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న కాలంలో జరిగిందని అదానీ వివరించారు.