Kommineni Srinivasarao: ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేనికి కందుకూరులో విలేకరుల సెగ
- ఇటీవల ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కొమ్మినేని
- జిల్లాల పర్యటనకు వచ్చిన వైనం
- కందుకూరులో తొక్కిసలాట జరిగిన ప్రదేశం సందర్శన
- రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అడ్డుతగిలిన విలేకరులు
గత నవంబరులో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు జిల్లాల పర్యటనకు వచ్చారు. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. ఇటీవల టీడీపీ సభలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక విలేకరుల నుంచి ఊహించని రీతిలో ప్రశ్నల పరంపర ఎదురైంది.
తొక్కిసలాట ప్రదేశం వద్ద రాజకీయ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారంటూ విలేకరులు కొమ్మినేనిని ప్రశ్నించారు. మీరు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా వచ్చారా? లేక రాజకీయ నాయకుడిగా వచ్చారా? అంటూ ఆయనను నిలదీశారు.
కరోనాతో ఎంతోమంది విలేకరులు మృతి చెందితే మీరు వారి కుటుంబాలను ఆదుకున్నారా? విలేకరుల అక్రిడిటేషన్ సమస్యను పరిష్కరించారా? ప్రెస్ అకాడమీ చైర్మన్ గా జర్నలిస్టుల కోసం ఏంచేశారు మీరు? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
అందుకు కొమ్మినేని బదులిస్తూ, తాను మరోసారి కందుకూరు వచ్చినప్పుడు ఈ అంశాలు మాట్లాడతానని అన్నారు. మీరు మళ్లీ వచ్చేదెప్పుడు? మాతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడేదెప్పుడు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు చెప్పలేకపోతున్నారు కదా! అంటూ ఓ విలేకరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో కొమ్మినేని స్పందిస్తూ "మాకు చేతకాదు" అంటూ అక్కడ్నించి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. "ఇది బాగుంది" అంటూ సదరు విలేకరి వ్యంగ్యం ప్రదర్శించారు.
ఘటన జరిగిన తర్వాత ఇన్నిరోజులకు వచ్చారు... చెప్పడం చేతకాదు కానీ మళ్లీ ప్రెస్ మీట్ ఒకటి అంటూ ఇతర విలేకర్లు కూడా కొమ్మినేనికి చురకలు అంటించారు.