Atchannaidu: ఇంటూరి నాగేశ్వరరావు అరెస్ట్ పై తీవ్రస్థాయిలో స్పందించిన అచ్చెన్నాయుడు
- కందుకూరు టీడీపీ సభలో తొక్కిసలాట
- టీడీపీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు అరెస్ట్
- కోర్టు ఆదేశాలను పట్టించుకోవడంలేదన్న అచ్చెన్న
- జగన్ దుర్మార్గానికి పరాకాష్ఠ అని వ్యాఖ్యలు
- అధికారంలోకి రాగానే తమ రియాక్షన్ చూపిస్తామని హెచ్చరిక
తొక్కిసలాట ఘటన కేసులో కందుకూరు టీడీపీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. కందుకూరు ఘటనలో నాగేశ్వరరావు అరెస్ట్ ను ఖండిస్తున్నట్టు తెలిపారు. 41(ఏ) నోటీసులు ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలను పోలీసులు లెక్కచేయడంలేదని ఆరోపించారు. కోర్టులు షోకాజ్ నోటీసులు ఇస్తున్నా పోలీసుల వైఖరి మాత్రం మారడంలేదని విమర్శించారు.
సభలు నిర్వహిస్తే కేసులు పెట్టడం, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం జగన్ దుర్మార్గానికి పరాకాష్ఠ అని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మా రియాక్షన్ ఏంటో చూపిస్తాం అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసులు బోనులో చేతులు కట్టుకోకతప్పదని స్పష్టం చేశారు.