Rajamouli: న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు అందుకున్న రాజమౌళి

Rajamouli receives New York Film Critics Circle Best Director Award for RRR

  • అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ హవా
  • రాజమౌళికి విశిష్ట పురస్కారం
  • న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి
  • కుటుంబానికి రుణపడి ఉంటానన్న రాజమౌళి
  • రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ధన్యవాదాలు

ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళి పేరుప్రఖ్యాతులు అంతర్జాతీయస్థాయికి చేరాయి. ప్రపంచ చిత్ర రంగంలో విశిష్ట పురస్కారంగా భావించే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డును ఆయన న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అందుకున్నారు. ఆస్కార్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉరకలేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ఈ అవార్డు గొప్ప ఉత్తేజాన్నిస్తోంది. 

ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకు ఇటీవల ఎంపిక చేయడం తెలిసిందే. న్యూయార్క్ లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి రాజమౌళి కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. 

అవార్డు అందుకున్న సందర్భంగా రాజమౌళి భావోద్వేగాలతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక వేదికపై అందరి ముందు నిల్చుని మాట్లాడడం కంగారు పుట్టిస్తోందని అన్నారు. 

తన దృష్టిలో సినిమా పవిత్రమైన దేవాలయం వంటిదని, బాల్యంలో థియేటర్ కు వెళ్లి సినిమా చూసిన అనుభూతులు ఇంకా పదిలంగా ఉన్నాయని తెలిపారు. ఓ సీన్ షూట్ చేసేముందు, అది థియేటర్ లో తెరపై ఎలా ఉంటుంది? అని ఊహించుకుని చిత్రాలు చేస్తానని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను దృష్టిలో ఉంచుకునే తాను సినిమాలు చేస్తానని, కానీ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విదేశీయులు కూడా ఆస్వాదించడం చూస్తున్నానని రాజమౌళి తెలిపారు. 

సినిమా యూనిట్ కుటుంబం వంటిది అని చాలామంది చెబుతుంటారని, కానీ తన సినిమా యూనిట్ నిజంగానే తన కుటుంబం అని రాజమౌళి వెల్లడించారు. తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారని, పెద్దన్న కీరవాణి సంగీతం సమకూర్చుతారని, తన అర్ధాంగి రమ కాస్ట్యూమ్ డిజైనర్ గా, కుమారుడు కార్తికేయ, వదిన వల్లి లైన్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తారని, అన్నయ్య కీరవాణి కుమారుడు కాలభైరవ సింగర్ గా,  మరో సోదరుడు (శివశ్రీ కాంచీ) రచయితగా తన వెంట నిలిచే బృందం అని వివరించారు. అందుకే తాను ఎలాంటి విజయం సాధించినా, అవార్డు అందుకున్నా కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకుంటానని తెలిపారు.

  • Loading...

More Telugu News