Bonda Uma: రాబోయే రోజుల్లో తాలిబన్ చట్టాలను కూడా తెస్తారేమో: బొండా ఉమ
- కందుకూరు, గుంటూరు తొక్కిసలాటకు పోలీసుల వైఫల్యమే కారణమన్న ఉమ
- ఈ రెండు ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్
- జగన్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందని ఆరోపణ
కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటకు పోలీసుల వైఫల్యమే కారణమని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. ఈ రెండు ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని... ఈ ప్రజా వ్యతిరేకతను పక్కదారి మళ్లించేందుకు ప్రతిపక్షాలను వేధిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు సభలకు భారీగా జనాలు వస్తుండటంతో జగన్ లో వణుకు మొదలయిందని అన్నారు. ఇంత భారీగా జనాలు వస్తున్నారంటే జగన్, వైసీపీ పని అయిపోయినట్టేనని చెప్పారు.
ఈ ప్రజాస్పందనను చూసి తట్టుకోలేకే సభలు, ర్యాలీలు పెట్టకుండా జీవో 1ని తీసుకొచ్చారని అన్నారు. 1861 నాటి బ్రిటీష్ చట్టానికి బూజు దులిపి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో తాలిబన్ చట్టాలను కూడా తీసుకొస్తారేమోనని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబును అడుగు పెట్టనీయకుండా అరాచకాన్ని సృష్టించారని అన్నారు. పోలీసులు కూడా వీధిరౌడీల్లా వ్యవహరిస్తూ టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జీలు చేశారని దుయ్యబట్టారు. జీవో 1 ద్వారా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందని మండిపడ్డారు.