Sharad Pawar: యువకులకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక్కపోవడానికి కారణం ఇదే: శరద్ పవార్
- దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్న శరద్ పవార్
- ఉద్యోగం లేకపోతే పిల్లను ఎవరిస్తారని ప్రశ్న
- చదువుకున్న వాళ్లు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచన
మన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని... ఉద్యోగాలు లేని కారణంగానే యువకులకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఉద్యోగం లేని వ్యక్తికి పిల్లను ఎవరిస్తారని ప్రశ్నించారు. ఒకసారి తాను ఒక ఊరికి వెళ్లానని... అక్కడ 30 ఏళ్ల లోపు వయసున్న కొందరు యువకులు పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నారని... ఎందుకు ఖాళీగా ఉన్నారని తాను ప్రశ్నిస్తే... తమ ప్రాంతంలో తాము చేయడానికి పనులు లేవని చెప్పారని అన్నారు. వాళ్లలో డీగ్రీలు, పీజీలు చేసిన వారు కూడా ఉన్నారని చెప్పారు. పని లేకపోవడంతో అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారని అన్నారు. చదువుకున్న వాళ్లు తమకు ఉద్యోగాలు కావాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
దేశంలోను, మహారాష్ట్రలోను నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని శరద్ పవార్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీని ఇచ్చిన బీజేపీ... అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించిందని చెప్పారు. మహారాష్ట్రలో తమ కూటమి అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించామని... ఆ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కొలువుతీరాక రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని విమర్శించారు.