BRS: నా కారునే ఆపుతారా? టోల్ ప్లాజా సిబ్బందిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి.. వీడియో వైరల్

 BRS MLA Durgam Chinnaiah allegedly assaults a toll plaza staff

  • మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ ప్లాజా వద్ద ఘటన
  • నిన్న రాత్రి టోల్ ప్లాజా మీదుగా వెళ్లిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
  • రూట్ క్లియర్ చేయకపోవడంతో కారు దిగివచ్చి సిబ్బందిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే

తెలుగు రాష్ట్రాల్లో కొంత మంది ప్రజా ప్రతినిధులు తమ హోదా, స్థాయిని మరిచి అనుచిత చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడికి దిగారు. గత నెలలో ప్రారంభమైన మందమర్రి టోల్‌ప్లాజా వద్ద వాహనదారుల నుంచి  సిబ్బంది టోల్‌ రుసుము వసూలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే వాహనం టోల్‌ప్లాజా వద్దకు చేరుకుంది. సిబ్బంది ప్రోటోకాల్‌ ప్రకారం గేటు తీయడంలో ఆలస్యం చేయడంతో ఎమ్మెల్యే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కారు దిగిన ఎమ్మెల్యే టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో వారిపై స్వయంగా దాడికి దిగారు. దాంతో, సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు. 

సీసీటీవీల్లో రికార్డయిన దాడి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రోటోకాల్ ప్రకారం తన కారు వచ్చినప్పుడు రూట్ క్లియర్ చేయడంలో అక్కడి సిబ్బంది ఆలస్యం చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. రహదారి పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రజల నుంచి టోల్‌ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ సిబ్బందిని ఆయన ప్రశ్నించారని చెబుతున్నారు. అయితే, ఉచితంగా వెళ్లే రూట్లో కాకుండా టోల్ వసూలు చేసే మార్గంలోకి ఎమ్మెల్యే కారు రావడం వల్లే ఆలస్యం అయిందని టోల్ ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై ఇప్పటిదాకా ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

More Telugu News