Jagan: చంద్రబాబును విమర్శించే క్రమంలో 'జడ్జి-ప్రాసిక్యూటర్' కథ చెప్పిన సీఎం జగన్

CM Jagan criticizes Chandrababu in Rajahmundry

  • తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • రాజమండ్రిలో పెన్షన్ లబ్దిదారులతో ముఖాముఖి
  • చంద్రబాబు మానవతావాదిలా నాటకాలు ఆడుతున్నాడని విమర్శలు
  • ఎన్టీఆర్ ను అడ్డంపెట్టుకుని శవరాజకీయాలు చేసే నైజం అని వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ ఇవాళ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు విచ్చేశారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పెన్షన్ లబ్దిదారుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్షనేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫొటోషూట్, డ్రోన్ షాట్ల కోసం రాజమండ్రి పుష్కరాల్లో 29 మందిని బలి తీసుకున్నారని ఆరోపించారు. దానిపై నిలదీస్తే కుంభమేళాలో చనిపోలేదా? అని మాట్లాడతాడని అన్నారు. కందుకూరులో జనం తక్కువగా వస్తే, ఎక్కువగా వచ్చినట్టు చూపించేందుకు జనాలను ఒక ఇరుకు సందులోకి నెట్టి సభ నిర్వహించాడని మండిపడ్డారు. కందుకూరులో 8 మందిని బలిగొని, వారికి మౌనం పాటించాలని అంటాడని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గుంటూరులో తాను వచ్చేదాకా చీరలు పంచవద్దని చెప్పి, మహిళల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడని, మళ్లీ మానవతావాదిలా నాటకాలు ఆడతాడని విమర్శించారు. ఎన్టీఆర్ ను అడ్డంపెట్టుకుని శవరాజకీయాలు చేసే నైజం చంద్రబాబుదని, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంపి, మళ్లీ మొసలి కన్నీరు కారుస్తాడని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ జడ్జి-ప్రాసిక్యూటర్ కథ చెప్పారు. 

"ఓ వ్యక్తి కోర్టులో న్యాయమూర్తి ఎదుటకు వచ్చి... అయ్యా నాకు తల్లిదండ్రులు లేరు... నాపై దయచూపి నన్ను శిక్షించవద్దు అని కోరతాడు. దాంతో ఆ జడ్జి... ఆ వ్యక్తి ఏం నేరం చేసి కోర్టుకు వచ్చాడని ప్రాసిక్యూటర్ ను అడుగుతారు. అప్పుడా ప్రాసిక్యూటర్... నిజమే యువరానర్! ఆ వ్యక్తికి తల్లిదండ్రులు లేరు. ఎందుకంటే, ఆ తల్లిదండ్రులను అతడే చంపాడు కాబట్టి అని వివరిస్తాడు. చంద్రబాబును చూస్తే ఇలాగే అనిపిస్తుంది" అంటూ వివరించారు. పేదవాళ్లను చంపేసి పార్టీ కోసం ప్రాణత్యాగాలు చేశారంటాడని ధ్వజమెత్తారు. 

కందుకూరు ఘటన కాకుండా కొత్త సంవత్సరంలోనూ చంద్రబాబు మరో ముగ్గురిని బలిదీసుకున్నాడని, దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రాయవని, దత్తపుత్రుడు కూడా ప్రశ్నించడని సీఎం జగన్ విమర్శించారు. ఇటువంటి పెద్ద మనిషి చంద్రబాబు అయితే, అతడిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎల్లోమీడియాతో పాటు దత్తపుత్రుడు పనిచేస్తున్నారని తెలిపారు. ఇటువంటివేమీ తనకు లేకపోయినా, తనకు దేవుడి దయ, ప్రజల చల్లని ఆశీస్సులు ఉన్నాయని ఉద్ఘాటించారు. 

అంతకుముందు, పెన్షన్ల గురించి చెబుతూ, గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. గతంలో పెన్షన్లు కావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, లంచాలు చెల్లించాల్సి వచ్చేదని సీఎం జగన్ ఆరోపించారు. ఇప్పుడు కేవలం అర్హతనే ప్రామాణికంగా చేసుకుని పెన్షన్లు మంజూరు చేస్తున్నామని, వివక్ష, కత్తిరింపులు, అవినీతి, ఎగ్గొట్టడాలకు తావులేని రీతిలో పెన్షన్లు చెల్లిస్తున్నామని వివరించారు. చెడు చేసిన వాళ్లకు కూడా మంచి చేయాలన్న ఉద్దేశం తప్ప మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు. 

గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి పెన్షన్ వస్తే వైసీపీ వచ్చాక పెన్షన్ లబ్దిదారుల సంఖ్య 64 లక్షలకు పెరిగిందని తెలిపారు. దేశంలో అత్యధిక మొత్తంలో పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏపీనే అని సీఎం జగన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News