pm modi: విజ్ఞానశాస్త్రంలో టాప్ టెన్ లో భారత్: ప్రధాని మోదీ
- స్టార్టప్ ల విషయంలో ప్రపంచంలోనే టాప్ 3 లో చోటు
- నూతన ఆవిష్కరణలతో సైన్స్ అండ్ టెక్నాలజీని బలోపేతం చేయాలి..
- శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
విజ్ఞానశాస్త్రానికి సంబంధించి అత్యుత్తమ దేశాల సరసన భారతదేశం కూడా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. టాప్ టెన్ దేశాల్లో భారత్ కూడా ఒకటన్నారు. ఈమేరకు మంగళవారం 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించి, మాట్లాడారు. మహారాష్ట్రలోని రాష్ట్ర సంత్ తుకాదోజీ మహరాజ్ నాగ్ పూర్ యూనివర్శిటీలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో ప్రధాని వర్చువల్ గా మాట్లాడుతూ.. విజ్ఞానశాస్త్రంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చాలని పిలుపునిచ్చారు. ప్రయోగశాలల నుంచి వాడకంలోకి వచ్చినపుడు మాత్రమే సైన్స్ ప్రయత్నాలు ఫలిస్తాయన్నారు.
సైన్స్ లో ప్రపంచంలోని టాప్ 10 దేశాల్లో భారత్ కూడా ఉండడం మనందరికీ గర్వకారణమని ప్రధాని చెప్పారు. 21వ శతాబ్దంలో డేటా, టెక్నాలజీలే భారత దేశ విజ్ఞానశాస్త్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళతాయని చెప్పారు. కాగా, సమాజంలో మహిళల భాగస్వామ్యం పెరగడం సైన్స్ పురోగతికి నిదర్శనమని చెప్పారు. స్టార్టప్ ల విషయంలో ప్రపంచంలోనే తొలి 3 దేశాల్లో భారత్ ఒకటని మోదీ చెప్పారు.
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 2015లో మన దేశం 81 స్థానంలో ఉండగా.. 2022లో 40వ స్థానానికి చేరుకున్నామన్నారు. కాగా, నూతన ఆవిష్కరణలతో శాస్త్ర సాంకేతిక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు.