CM Ramesh: అమిత్ షా కర్నూలుకు వస్తున్నారు.. ర్యాలీ, సభ పెడతాం.. ప్రభుత్వ పర్మిషన్ మాకు అవసరం లేదు: సీఎం రమేశ్

We will conduct Amit Shah rally in Kurnool says CM Ramesh
  • యాక్సిడెంట్లు జరిగితే రోడ్లపై జనాలు తిరగకుండా చేస్తామా? అని సీఎం రమేశ్ ప్రశ్న
  • ప్రతిపక్షాలను అణచివేయాలనుకుంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరిక
  • సభలు పెట్టకూడదనే జీవోను రద్దు చేయాలని డిమాండ్
ఏపీలో రాజకీయ పార్టీలు రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. మీరు ప్రతిపక్షాలను ఎంతగా అణచివేయాలనుకుంటే అంతకంటే ఎక్కువగా ప్రజలు తిరగబడతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని... రాబోయే రోజుల్లో వడ్డీలు కట్టేందుకు అవసరమైన అభివృద్ధి కూడా ఏపీలో జరగడం లేదని చెప్పారు. దీని గురించి ఆలోచించకుండా ప్రతిపక్షాల గొంతును నొక్కేయాలనుకోవడం సరికాదని అన్నారు. 

రోడ్లపై యాక్సిడెంట్లు జరిగి మరణాలు సంభవిస్తే... రోడ్లపై జనాలను తిరగకుండా చేస్తామా? అని సీఎం రమేశ్ ఎద్దేవా చేశారు. ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని... ఆ బాధ్యతను విస్మరించి... ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను మీడియా ద్వారా తెలియనీయకుండా చేయాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్నూలుకు వస్తున్నారని... ఈ సందర్భంగా బీజేపీ ర్యాలీ నిర్వహిస్తుందని, సభ పెడుతుందని, అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుందని... తమ పార్టీ కార్యక్రమాలకు మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సభలు పెట్టకూడదనే జీవోను వెంటనే రద్దు చేసి, మీ తప్పిదాలను ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు.  

సభల్లో దురదృష్టకర ఘటనలు జరిగితే ఎంక్వైరీ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని... ఈ మాదిరి ప్రతిపక్షాల గొంతును నొక్కేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరని పని అని అన్నారు. పోలీసులు ప్రభుత్వ కార్యక్రమాలకు ఒక విధంగా, ప్రతిపక్ష కార్యక్రమాలకైతే మరో విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజలు, ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయారని... ఎప్పుడెప్పుడు ఎలెక్షన్లు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని దించేయాలని ప్రజలు డిసైడ్ అయిపోయారని చెప్పారు. గత ప్రభుత్వం ఇదే విధంగా ఆలోచించి ఉంటే జగన్ పాదయాత్ర కొనసాగేదా? అని ప్రశ్నించారు. మీ పాదయాత్రకు అప్పటి ప్రభుత్వం రక్షణ కల్పించలేదా? అని అడిగారు. అనుభవం లేనటువంటి పాలన ఉంటే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.
CM Ramesh
Amit Shah
BJP
Kurnool
Public Meeting
YSRCP

More Telugu News