Cash: కనీ వినీ ఎరుగని స్థాయికి కరెన్సీ వినియోగం
- డీమోనిటైజేషన్ నాటికి చలామణిలో ఉన్న నోట్లు రూ.17.7 లక్షల కోట్లు
- 2022 డిసెంబర్ 23 నాటికి రూ.32.4 లక్షల కోట్లు
- 2022 డిసెంబర్ లో రూ.12.8 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు
ఒకవైపు డిజిటల్ చెల్లింపులు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు కరెన్సీ వినియోగం కూడా పతాక స్థాయికి చేరింది. ఈ రెండింటికీ పొంతన లేకుండా ఉండడం అన్నది పెరిగిన ఆర్థిక కార్యకలాపాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు (డీమోనిటైజేషన్) చేసే నాటికి వ్యవస్థలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ రూ.17.7 లక్షల కోట్లు. రద్దు చేసిన తర్వాత ఇది రూ.9 లక్షల కోట్లకు తగ్గిపోయింది. 2022 డిసెంబర్ 23 నాటికి తిరిగి చలామణిలో ఉన్న నగదు రూ.32.4 లక్షల కోట్లకు చేరింది. అంటే ఆరేళ్ల కాలంలో దాదాపు 86 శాతం మేర కరెన్సీ నోట్ల వినియోగం పెరిగింది.
దేశ ఉత్పాదకత పెరుగుతున్న కొద్దీ ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందన్న విషయం తెలిసిందే. దీని ఫలితమే నగదు వినియోగం దాదాపు రెట్టింపు స్థాయికి చేరుకోవడం. కాకపోతే ఒకవైపు డిజిటల్ చెల్లింపులు భారీ స్థాయిలో కొనసాగుతుంటే, మరోవైపు నగదు చలామణి గణాంకాలు అన్నవి నిజంగా ఆశ్చర్యపరిచేవే. యూపీఐ ఆధారిత లావాదేవీలు డిసెంబర్ లో 782 కోట్లు నమోదు కాగా, వీటి విలువ రూ.12.8 లక్షల కోట్లుగా ఉంది. నవంబర్ తో పోలిస్తే 7 శాతం అధికం. దీన్ని బట్టి చూస్తుంటే నోట్లు బడా వ్యాపారవేత్తల బీరువాల్లోకి చేరుతున్నట్టు అనుమానించాల్సి వస్తోంది. ఎందుకంటే సామాన్యులు, వేతన జీవులు డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యమిస్తున్నారు.