Kapil Dev: పంత్ కు ప్రమాదం నేపథ్యంలో కపిల్ దేవ్ కీలక సూచనలు
- ఒక డ్రైవర్ ను పెట్టుకోగల స్తోమత పంత్ కు ఉందన్న కపిల్
- వాహనాన్ని సొంతంగా నడపడం సరికాదన్న మాజీ క్రికెటర్
- తనకు సైతం కెరీర్ మొదట్లో ఇలాంటి అనుభవం ఉందని వెల్లడి
ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ స్వయంగా నడుపుతున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన నేపథ్యంలో.. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక సూచనలు చేశారు. గత శుక్రవారం ఉదయం కారు ప్రమాదం జరగడం తెలిసిందే. ఉత్తరాఖండ్ లోని రూర్కీకి వెళుతుండగా కారు అదుపు తప్పి డిడైవర్ ను ఢీకొనడం, వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం గమనార్హం. ఓ బస్సు డ్రైవర్ పంత్ ను కాపాడాడు. ప్రస్తుతం డెహ్రాడూన్ లోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు.
దీనిపై కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘ఇదొక పాఠం. నేను కూడా కెరీర్ మొదట్లో మోటారు సైకిల్ ప్రమాదానికి గురయ్యాను. ఆ రోజు నుంచి నా సోదరుడు నన్ను మోటారు బైక్ ను ముట్టనివ్వలేదు. రిషబ్ పంత్ క్షేమంగా బయటపడినందుకు దేవుడికి ధన్యవాదాలు.
''నీకు మంచి కారు ఉంది. దానిపై గొప్ప వేగంగా దూసుకుపోవచ్చు. కానీ, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఓ డ్రైవర్ ను నియమించుకోవడం నీకు భారం కాదు. నీవు సొంతంగా కారును నడపకూడదు. ఎవరికైనా ఈ తరహా కోరికలు ఉంటాయని నేను అర్థం చేసుకోగలను. ఆ వయసులో ఉన్న వారికి ఇలాంటి కోరికలు ఉండడం సహజమే. కానీ, నీకంటూ బాధ్యతలు ఉన్నాయి. నీ గురించి నీవే జాగ్రత్తలు తీసుకోగవు. నీ గురించి నీవు నిర్ణయం తీసుకోవాలి’’ అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.