BCCI: ముగిసిన బీసీసీఐ సమీక్ష సమావేశం... మళ్లీ తెరపైకి యో-యో ఫిట్ నెస్ టెస్టు
- ముంబయిలో బీసీసీఐ సమావేశం
- హాజరైన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, రోహిత్ శర్మ, ద్రావిడ్
- హాజరైన వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ
టీమిండియా ప్రదర్శనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నేడు ముంబయిలో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జై షా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడు వీవీఎస్ లక్ష్మణ్, సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం బోర్డు కార్యదర్శి జై షా ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇటీవలకాలంలో తెరమరుగైన యో-యో ఫిట్ నెస్ టెస్టు, డెక్సా టెస్టు (ఎముకల సాంద్రతను పరిశీలించే స్కానింగ్ టెస్టు)లను సెలెక్షన్ ప్రక్రియలో తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు షా తెలిపారు.
కోర్ ఆటగాళ్ల జాబితాకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన రోడ్ మ్యాప్ ల అమలుకు సిఫారసులు వచ్చినట్టు వివరించారు. ఇక 2023లో ఐసీపీ వన్డే వరల్డ్ కప్, పలు ద్వైపాక్షిక సిరీస్ లు ఉన్నందున ఐపీఎల్ లో ఆడే టీమిండియా ఆటగాళ్లపై పనిభారం పడని రీతిలో ఫ్రాంచైజీలతో జాతీయ క్రికెట్ అకాడమీ సమన్వయం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు.
2023 వన్డే వరల్డ్ కప్ రూట్ మ్యాప్ ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లు అందుబాటులో ఉండే విషయం, ఆటగాళ్లపై పనిభారం నిర్వహణ, ఫిట్ నెస్ ప్రమాణాలపైనా ఈ సుదీర్ఘ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. కాగా, వన్డే వరల్డ్ కప్ కోసం 20 మంది ఆటగాళ్లతో ఓ జాబితా రూపొందించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.