vehicles: డ్రైవింగ్ లో కునుకేస్తే కేకపెడుతుంది
- వాహనాల్లో డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టం ఏర్పాటుపై కేంద్రం కసరత్తు
- రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో వీటి ఏర్పాటును తప్పనిసరి చేసేలా నిర్ణయం!
- నిపుణుల కమిటీ నివేదికను పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు
తెల్లవారుజామున డ్రైవింగ్ చేస్తుంటే మగత వల్ల కళ్లు మూతలు పడుతుంటాయి.. ఫలితంగా వాహనం అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం యాక్సిడెంట్లకు ఇదే కారణమని కేంద్ర రవాణా శాఖ నివేదిక ఒకటి వెల్లడించింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ల నిద్ర మత్తును వదిలించేందుకు వాహనాలలో అలర్ట్ సిస్టంను ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.
డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టం పేరుతో విదేశాల్లో చాలాకాలం నుంచే ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. మన దేశంలోని వాహనాల్లోనూ దీనిని ఇన్ స్టాల్ చేసుకోవడం తప్పనిసరి చేసేందుకు కేంద్రం చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా నిపుణుల కమిటీ సమర్పించిన ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ నివేదికను పరిశీలిస్తోంది.
డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టంలలో కొన్ని వాహనం స్టీరింగ్ వీల్ కదలికలను పరిశీలిస్తూ డ్రైవర్లను అలర్ట్ చేస్తుంటాయి. మరికొన్ని డ్రైవర్ కళ్లు, ముఖం, రోడ్డు మీద దృష్టిపెడతాయి. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి నిద్రమత్తుతో కనిపించినా.. కనురెప్పలు మూసుకుపోతున్నా వెంటనే గుర్తించి వాయిస్ మెసేజ్ ద్వారా అలర్ట్ చేస్తాయి. కొన్నింటిలో పెద్ద శబ్దంతో డ్రైవర్ నిద్ర మత్తును వదిలించే ఏర్పాట్లు ఉన్నాయి.