wearing seatbelts: 83 శాతం మరణాలు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే!
- గతేడాది చోటు చేసుకున్న మరణాలపై కేంద్ర ప్రభుత్వం నివేదిక
- ద్విచక్ర వాహన ప్రమాద మృతుల్లో 63 శాతం మంది హెల్మెట్ ధరించలేదు
- అత్యధికంగా యూపీలో కారు ప్రమాద మృతులు
ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు విధిగా హెల్మెట్, కార్లలో ప్రయాణంచే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని పోలీసులు తరచూ సూచిస్తుంటారు. దీనిపై వాహనదారుల్లో అవగాహన కోసం పలు కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. ద్విచక్ర వాహనం నడిపే వారిలో కొందరు ఈ నిబంధన ఫాలో అవుతున్నా.. మెజారిటీ కారు యజమానులు దీన్ని ఆచరణలో పెట్టడంలో విఫలమవుతున్నారు. ఇదే వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నట్టు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నివేదిక తెలియజేస్తోంది.
‘2021 లో రోడ్డు ప్రమాదాలు’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికను పరిశీలించినప్పుడు.. 2021లో జరిగిన కారు ప్రమాదాల్లో మరణించిన ప్రతి 10 మందిలో 8 మంది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లేనని తెలుస్తోంది. కారు ప్రమాదాల్లో గతేడాది 19,811 మంది మరణిస్తే, అందులో 16,397 మంది సీటు బెల్ట్ పెట్టుకోలేదు. ఇందులో 8,438 మంది డ్రైవర్లు ఉన్నారు. మిగిలిన వారు ప్రయాణికులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం.. సీటు బెల్ట్ పెట్టుకోవడం ద్వారా ప్రమాద మరణాలను గణనీయంగా తగ్గించొచ్చని తెలుస్తోంది. స్వల్ప గాయలతో బయటపడే అవకాశం ఉంటుంది.
ఇక ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణించిన ప్రతి 100 మందికి గాను 63 మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లేనని తెలుస్తోంది. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో గతేడాది 69,385 మంది మరణించారు. వీరిలో 47,000 మందికి హెల్మెట్ లేదు. ముఖాన్ని పూర్తిగా కప్పేసే హెల్మెట్లు (ఫుల్ ఫేస్) ధరించినట్టయితే 64 శాతం ద్విచక్ర వాహన ప్రమాద మరణాలను తగ్గించొచ్చని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ద్విచక్ర వాహనదారుల్లో చాలా మంది హాఫ్ ఫేస్ హెల్మెట్లు ధరిస్తుండడం చూస్తూనే ఉన్నాం. వీరికి రక్షణ తక్కువేనన్న విషయంపై అవగాహన లేదని తెలుస్తోంది. రాష్ట్రాల పోలీసు యంత్రాంగం ఇచ్చిన గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. అత్యధికంగా కారు ప్రమాద మరణాలు యూపీలో (3,863) నమోదు కాగా, ఎంపీ (1,737), రాజస్థాన్ (1,370) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.