T20 World Cup: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ జట్టులో కర్నూలు బిడ్డ
- మహిళల టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన అంజలి
- రిజర్వ్ ప్లేయర్ గా సబ్బినేని మేఘనకు చోటు
- ఫిబ్రవరి 10 నుంచి దక్షిణాఫ్రికాలో టోర్నీ
తెలుగమ్మాయి అంజలి శర్వాణి మహిళల టీ20 వరల్డ్ కప్‌నకు ఎంపికైంది. దక్షిణాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును అఖిల భారత మహిళల సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టులో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అంజలి శర్వాణికి చోటు దక్కింది. ఎడమచేతి వాటం పేసర్ అయిన అంజలి ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ తో అరంగేట్రం చేసింది. మరో తెలుగమ్మాయి సబ్బినేని మేఘన రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికైంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత్ ఈ టోర్నీలో పాల్గొంటుంది.
ప్రపంచ కప్ లో గ్రూప్2లో ఉన్న భారత్ ఫిబ్రవరి 12న తన తొలి మ్యాచ్‌ను కేప్‌టౌన్‌లో పాకిస్థాన్‌తో ఆడుతుంది. 15న వెస్టిండీస్, 18న ఇంగ్లండ్, 20న ఐర్లాండ్ జట్లతో పోటీ పడుతుంది. ఇక, ఈ వరల్డ్‌కప్ నకు ముందు దక్షిణాఫ్రికాలోనే భారత్ ముక్కోణపు టీ20 సిరీస్ ఆడుతుంది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పాల్గొంటున్నాయి. ఈ సిరీస్ కు కూడా సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఇందులోనూ అంజలి, సబ్బినేని మేఘన చోటు దక్కించుకున్నారు.
టీ20 వరల్డ్ కప్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ -కెప్టెన్), షెఫాలీ వర్మ, యస్తికా భాటియా (కీపర్), రిచా ఘోష్ (కీపర్) జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, అంజలి శర్వాణి, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే; రిజర్వ్‌లు: సబ్బినేని మేఘన, స్నేహ రాణా, మేఘనా సింగ్.
ముక్కోణపు సిరీస్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), యస్తికా భాటియా (కీపర్), జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాజేశ్వరి, రాధా యాదవ్, రేణుకా సింగ్, మేఘనా ఠాకూర్, అంజలి శర్వాణి, సుష్మా వర్మ (కీపర్), అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, శిఖా పాండే.