Chiranjeevi: 'వాల్తేరు వీరయ్య' ప్రెస్ మీట్లో రవితేజ గురించి మాట్లాడకపోవడంపై చిరంజీవి వివరణ
- చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య
- జనవరి 13న రిలీజ్
- నిన్న హైదరాబాదులో ప్రెస్ మీట్
- రవితేజ గురించి ప్రస్తావించని చిరంజీవి
- చర్చనీయాంశంగా మారిన విషయం
హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్న వాల్తేరు వీరయ్య టీమ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తదితరులు హాజరయ్యారు. అయితే, ఈ ప్రెస్ మీట్లో చిరంజీవి తన ప్రసంగంలో రవితేజ గురించి ఎక్కడా చెప్పకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనిపై చిరంజీవి ట్విట్టర్ లో ప్రత్యేక ప్రకటన చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రెస్ మీట్లో చాలా తక్కువగా మాట్లాడాలని అనుకున్నానని, ఈ క్రమంలో రవితేజ గురించి చెప్పడం మిస్సయ్యానని వివరణ ఇచ్చారు. ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత తిరిగి వెళుతుంటే, రవితేజ గురించి మాట్లాడకపోవడాన్ని ఎంతో లోటుగా ఫీలయ్యానని చిరంజీవి తెలిపారు. అందుకే ట్విట్టర్ లో స్పందిస్తున్నానని పేర్కొన్నారు.
"వాల్తేరు వీరయ్య ప్రాజెక్టు గురించి చెప్పగానే అన్నయ్య సినిమాలో నటిస్తున్నానంటూ రవితేజ వెంటనే ఒప్పుకున్నాడు. రవితో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ షూటింగులో పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించింది. షూటింగులో ప్రతి రోజు ఆస్వాదించాను. వాల్తేరు వీరయ్యలో రవితేజ లేకపోతే ఈ సినిమా అసంపూర్ణంగా మిగిలిపోయేది. డైరెక్టర్ బాబీ చెబుతున్నట్టుగా పూనకాలు లోడింగ్ లో రవితేజ పాత్ర చాలా చాలా ఉంది. ఆ విషయాలన్నీ త్వరలో మాట్లాడుకుందాం" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.