RBI: బ్యాంకు లాకర్ నిబంధనల్లో మార్పులు.. జనవరి ఒకటి నుంచే అమల్లోకి!

Bank locker rules changed according to RBI orders

  • లాకర్ ఒప్పందం మార్చుకోవాలంటూ బ్యాంకుల నుంచి సందేశాలు
  • స్టాంప్ పేపర్ పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఒప్పందం జరగాలి
  • లాకర్ రూమ్ లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి: ఆర్ బీఐ సూచనలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం కొత్త ఏడాది నుంచి లాకర్ల నిబంధనలను బ్యాంకులు మార్చేస్తున్నాయి. ఇప్పటికే లాకర్ సదుపాయం ఉపయోగించుకుంటున్న ఖాతాదారులకు బ్యాంకులు సందేశాలు పంపుతున్నాయి. లాకర్ ఒప్పందాన్ని మార్చుకోవాలని అందులో సూచిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే లాకర్ నిబంధనల్లో ఆర్బీఐ పలు మార్పులు సూచించింది. వాటి ప్రకారం నిబంధనల్లో మార్పులు చేసి, వచ్చే ఏడాది ఫస్ట్ నుంచి అమలులోకి తీసుకురావాలని బ్యాంకులు నిర్ణయించాయి.

కొత్త నిబంధనలు..
  • లాకర్ ఒప్పందంలో బ్యాంకులు ఎలాంటి అనైతిక షరతులు చేర్చడానికి వీల్లేదు. అదే సమయంలో బ్యాంకుల ప్రయోజనాలు దెబ్బతీసేంత ఉదారత్వమూ పనికిరాదు.
  • స్టాంప్ పేపర్ పై లాకర్ ఒప్పందం జరగాలి. ఇందులో లాకర్ నియమ నిబంధనలు పొందుపరిచి, నకలు కాపీని వినియోగదారుడికి అందించాలి.
  • ఒప్పందం తప్పకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉండాలి.
  • దొంగతనం, అగ్ని ప్రమాదం, బ్యాంకు బిల్డింగ్ కూలిపోవడం.. తదితర ప్రమాదాలు జరిగినపుడు లాకర్ కు వసూలు చేసిన ఫీజుకు వంద రెట్లు ఎక్కువ మొత్తాన్ని వినియోగదారుడికి చెల్లించాలి.
  • లాకర్ రూమ్ లో కచ్చితంగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి. వాటి డాటాను 180 రోజుల పాటు జాగ్రత్త చేయాలి.
  • లాకర్ తెరిచిన ప్రతిసారీ వినియోగదారుడికి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ పంపాలి. మోసాలను అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది.
  • కొత్తగా లాకర్ తీసుకునే వినియోగదారుడి నుంచి మూడేళ్ల అద్దె, ఇతర ఖర్చులకు సమానమైన మొత్తాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని బ్యాంకులు కోరవచ్చు. అయితే, ఇది తప్పనిసరి కాదు. ఇప్పటికే లాకర్ సదుపాయం ఉపయోగిస్తున్న వినియోగదారుడి నుంచి పిక్స్ డ్ డిపాజిట్ తీసుకోవాల్సిన అవసరంలేదు.
  • లాకర్ తీసుకున్న వినియోగదారుడు మరణించిన సందర్భంలో మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని, నామినీకి లాకర్ లోని వస్తువులను అప్పగించవచ్చు.

More Telugu News