Team India: మహ్మద్ సిరాజ్ కు చేదు అనుభవం.. బ్యాగ్ మిస్ చేసిన విమాన సిబ్బంది!
- బంగ్లాదేశ్ నుంచి మంగళవారం రాత్రి ముంబై చేరుకున్న సిరాజ్
- మూడు బ్యాగుల్లో ఒకటి రాకపోవడంతో ట్విట్టర్ లో ఫిర్యాదు చేసిన వైనం
- స్పందించి, బ్యాగ్ ను గుర్తించిన విమాన సిబ్బంది
విమాన ప్రయాణాల్లో భారత క్రికెటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్టార్ ఆటగాళ్లకు సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని రోజుల కిందట న్యూజిలాండ్ నుంచి బంగ్లాదేశ్ వెళ్లిన దీపక్ చహర్ లగేజీని విమాన సిబ్బంది రెండు రోజుల వరకు అతనికి అందించకపోవం చర్చనీయాంశమైంది.
ఇప్పుడు మరో క్రికెటర్ కు ఇలాంటి సమస్య ఎదురైంది. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ విస్తారా విమానంలో మంగళవారం ఢాకా నుంచి ముంబై చేరుకున్నారు. కానీ, ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత సిరాజ్ మూడు బ్యాగుల్లో రెండు మాత్రమే వచ్చాయి. ఈ విషయం అక్కడి సిబ్బందికి చెబితే వెంటనే తెచ్చిపెడతామని చెప్పారని, కానీ, ఎంతకీ రాలేదన్నాడు.
ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్న సిరాజ్ విమాన సిబ్బంది తన బ్యాగ్ మిస్ చేసిన విషయాన్ని ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. బ్యాగ్ లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయని, వీలైనంత త్వరగా హైదరాబాద్ చేరవేయాలని కోరాడు. దీనికి స్పందించిన విస్తారా వివరాలు పంపించాలని కోరగా.. సిరాజ్ వివరాలు ఇచ్చాడు. సిబ్బంది తన బ్యాగ్ ఎక్కడుందో గుర్తించారని బుధవారం మరో ట్వీట్ ద్వారా వెల్లడించాడు. దాన్ని త్వరలోనే తన వద్దకు చేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై స్పందించిన ఫ్యాన్స్, నెటిజన్లు విమాన సర్వీసుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.