Health Benefits: అరిటాకులో భోజనం.. ఆరోగ్య ప్రయోజనాలు
- పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
- ఆకుపై భోజనంతో మన శరీరంలోకి పాలీఫెనాల్స్
- వ్యర్థాల తొలగింపులో వీటి పాత్ర కీలకం
దక్షిణ భారతీయులు అరిటాకులో భోజనం చేసే సంప్రదాయం ఉంది. ఇలా ఎందుకు? అనే దానికి రకరకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాల్సిందే. ఇప్పటికీ విందుల్లో అరిటాకు వేసే సంప్రదాయం చాలా ప్రాంతాల్లో కొనసాగుతోంది. దక్షిణాంధ్ర ప్రాంతంలోని హోటళ్లలో అరిటాకు వినియోగించడాన్ని చూడొచ్చు. జర్నల్ ఆఫ్ ఎథ్నిక్ ఫుడ్స్ లో ప్రచురణ అయిన ఓ అధ్యయనం ప్రకారం.. లోహ పాత్రల వినియోగం ముందు నుంచే అరిటాకు వాడుకలో ఉంది. అరిటాకులు మందంగా, విశాలంగా ఉండడంతో ఇవి వాడుకలోకి వచ్చాయి.
అరిటాకుల్లో పాలీఫెనాల్స్ (ఎపిగాలోకాటెచిన్ గల్లేట్) ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలో ఒక రకం. రోగ నిరోధక శక్తిని ఇవి పెంచుతాయి. దీంతో వ్యాధులపై పోరాడే శక్తి బలపడుతుంది. అంతేకాదు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో పాలీ ఫెనాల్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అరిటాకులో ఆహారాన్ని ఉంచినప్పుడు పాలీఫెనాల్స్ ను గ్రహిస్తాయని, అవి మన శరీరంలోకి చేరి మేలు చేస్తాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. అరిటాకులకు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. సూక్ష్మ క్రిములను ఇవి చంపేస్తాయి. మనం పాత్రలను ఎంత కడిగినా అందులో బ్యాక్టీరియా ఉండే అవకాశం లేకపోలేదు. అరిటాకులతో ఈ సమస్యే ఉండదు. వేడిని తట్టుకునే గుణం అరిటాకులకు ఉంటుంది. అందుకే అరిటాకుల్లో కుడుములు చేస్తుంటారు. ఇవి పర్యావరణానికి అనుకూలమైనవి. విందు భోజనాల్లో వీటిని వాడడం వల్ల వ్యర్థాల సమస్యే ఉండదు.