Sabarimala: 41 రోజుల్లో అయ్యప్పను దర్శించుకున్న 30 లక్షలమంది.. రూ. 222.98 కోట్ల ఆదాయం
- భక్తుల దర్శనం అనంతరం గత రాత్రి ఆలయం మూసివేత
- తిరిగి ఈ నెల 30న తెరుచుకోనున్న ఆలయం
- జనవరి 14న మకరవిలక్కు పూజలు
- 20న తిరిగి ఆలయం మూత
శబరిమల ఆలయానికి గత 39 రోజుల్లో రూ. 222.98 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆలయ బోర్డు వెల్లడించింది. గత 41 రోజుల్లో 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు పేర్కొంది. కాగా, నిన్న 41 రోజుల మండల పూజ ముగింపు ఉత్సవాన్ని ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన పూజారి (తంత్రి) కందరారు రాజీవర్ నేతృత్వంలో స్వామి విగ్రహానికి బంగారు వస్త్రం (తనకా అంకి) అలంకరించారు.
అనంతరం కలశాభిషేకం పూజలు నిర్వహించారు. రాత్రి భక్తుల దర్శనం ముగిసిన అనంతరం ఆలయాన్ని మూసివేశారు. మకరజ్యోతి ఉత్సవాల (మకరవిలక్కు) కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. జనవరి 14న మకరవిలక్కు పూజలు నిర్వహిస్తారు. 20న ఆలయాన్ని మూసివేస్తారు. దీంతో వార్షిక యాత్రా సీజన్ ముగుస్తుంది.