Sanjay Raut: పాత ఇండియా, కొత్త ఇండియా అంటూ విభజిస్తున్నారు: సంజయ్ రౌత్
- మోదీని నవీన భారత పితామహుడిగా అభివర్ణించిన ఫడ్నవిస్ భార్య
- మహాత్మాగాంధీని అవమానించడమేనన్న సంజయ్ రౌత్
- స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు సంబంధమే లేదని విమర్శ
ప్రధాని మోదీని నవీన భారత పితామహుడిగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ అభివర్ణించడంపై శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. బీజేపీలో ఏ ఒక్కరూ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ ను దేశపితగా మాట్లడరని... కఠిన కారాగారశిక్షను అనుభవించిన సావర్కర్ ను ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూ ఉంటుందని చెప్పారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు పాత ఇండియా, కొత్త ఇండియా అంటూ విభజిస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ఆత్మబలిదానాల వల్లే స్వాతంత్ర్యం వచ్చిందనే విషయాన్ని బీజేపీ గుర్తిస్తోందా, లేదా అని ప్రశ్నించారు.
దేశంలో పేదరికం, ఆకలికేకలు, నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతున్నాయని... అలాంటప్పుడు నవీన భారత పితామహుడిగా మోదీని అభివర్ణించడం మహాత్మాగాంధీని అవమానించడమేనని చెప్పారు. దేశ ప్రజలే మహాత్మాగాంధీకి జాతిపిత అనే టైటిల్ ఇచ్చారని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు సంబంధమే లేదని... సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లను తమ వాళ్లుగా చిత్రీకరించుకునే ప్రయత్నాలను బీజేపీ చేస్తోందని విమర్శించారు.