: డీఎల్ కు మంత్రి వర్గం నుంచి ఉద్యాసన


డీఎల్ రవీంద్రారెడ్డిపై అధిష్ఠానం అనుమతితో వేటు పడింది. నిన్న మూడు దఫాలుగా అధిష్ఠానం పెద్దలతో సమావేశమైన సీఎం ఆయన మీద వేటు వేసేందుకు అనుమతి తీసుకున్నారు. గతంలో పలు పర్యాయాలు ముఖ్యమంత్రిని తీవ్రంగా వ్యతిరేకించే వైద్యఆరోగ్య శాఖా మంత్రి డీఎల్ పలు మార్లు సీఎంను బహిరంగంగా విమర్శిచారు. డీఎల్ ఆదినుంచీ సీఎంతో రాజీలేని పోరాటం చేస్తున్నారు. పలు వేదికలపై బహిరంగంగానే విమర్శలు కురిపించారు. అమ్మహస్తం, బంగారు తల్లి పథకాలకు నిధులెక్కడ్నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఆ పధకాలు కేబినెట్లో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారంటూ మండి పడ్డారు.

డీఎల్ కు పలువురు సీనియర్ మంత్రులు గొంతుకలపడంతో సీఎం కాస్త వెనుకకుతగ్గి చర్చిస్తామని హామీ ఇచ్చారు. పార్టీని సీఎం భ్రష్టుపట్టిస్తున్నారని, జగన్ కు ప్రధాన కోవర్టు కిరణ్ అని వ్యాఖ్యానించడానికి తోడు, మెడికల్ మేనేజ్ మెంట్ కోటా విషయంలో సీఎం అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం వంటి నిర్ణయాలతో ముఖ్యమంత్రికి కంట్లో నలుసులా తయారయ్యారు. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమంత బాగా లేదని, టీఎంపీలు రాజీనామా చేస్తే ఈయన మరింత చెలరేగే అవకాశం ఉండడంతో, డీఎల్ ను తొలగించాలని లేదంటే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని సీఎం అధిష్ఠానానికి నివేదించి అనుమతి తెచ్చారు.

అదీ కాక ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమౌతోంది. పదవులకోసం పోటీ పెరుగుతోంది. సందట్లో సడేమియా అన్నట్టు కొందర్ని తప్పిస్తే, ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో తన అనుకూల కార్యవర్గం ఉంటుందనేది సీఎం ఆలోచన. అందుకు తగ్గట్టే డీఎల్ లండన్ పర్యటనలో ఉండగానే ఈ నిర్ణయం ప్రకటించారు. డీఎల్ ఈ నెల 4 న హైదరాబాద్ చేరుకోనున్నారు. డీఎల్ తో పాటూ మరో ఇద్దరిపై వేటు వేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇంటికి పోయేదెవరో.. మంత్రి వర్గంలో ఉండేదెవరో తెలీక మంత్రులు టెన్షన్ లో ఉన్నారు.

  • Loading...

More Telugu News