Army: సిక్కింలో ఘోర ప్రమాదం... 16 మంది ఆర్మీ జవాన్ల దుర్మరణం
- లోయలో పడిన ఆర్మీ వాహనం
- నుజ్జునుజ్జయిన ట్రక్కు
- 13 మంది జవాన్లు, ముగ్గురు అధికారుల దుర్మరణం
- నలుగురికి తీవ్ర గాయాలు
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాజ్ నాథ్ సింగ్
ఉత్తర సిక్కింలో చైనా సరిహద్దులకు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. వారిలో 13 మంది జవాన్లు కాగా, ముగ్గురు జూనియర్ కమిషన్డ్ అధికారులు ఉన్నారు. నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని హెలికాప్టర్ లో బెంగాల్ లోని ఆసుపత్రికి తరలించారు.
ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో మిలిటరీ ట్రక్కులో 20 మంది ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనం ఓ లోయలో పడిపోయింది. ఓ మలుపు వద్ద వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయినట్టు భావిస్తున్నారు. 100 అడుగుల ఎత్తు నుంచి వాహనం లోయలో పడిపోవడంతో నుజ్జునుజ్జయింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు ప్రారంభించారు.
ఈ విషాద ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.