Sunrisers Hyderabad: ప్రారంభమైన ఐపీఎల్ వేలం... రూ.13 కోట్లతో ఇంగ్లండ్ సంచలన ఆటగాడిని కొనుగోలు చేసిన సన్ రైజర్స్
- వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం మినీ వేలం
- కొచ్చిలో వేలం ప్రక్రియ నిర్వహణ
- హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ లను కొనేసిన ఎస్ఆర్ హెచ్
- జో రూట్ ను ఎవరూ కొనని వైనం
రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం నేడు ఆటగాళ్ల వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కేరళలోని కొచ్చిలో కొద్దిసేపటి కిందట వేలం ప్రారంభమైంది.
మెగా వేలంలో ఆచితూచి వ్యవహరించే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మినీ వేలంలో దూకుడు ప్రదర్శిస్తోంది. వేలం ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లండ్ యువకిశోరం హ్యారీ బ్రూక్ ను అదిరిపోయే ధరకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల సెంచరీల మోత మోగిస్తున్న హ్యారీ బ్రూక్ కోసం వేలంలో గట్టిపోటీ ఏర్పడగా, చివరికి రూ.13.25 కోట్లకు సన్ రైజర్స్ అతడిని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు, అదే ఊపులో జాతీయ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇక, సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను రూ.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. అజింక్యా రహానేను రూ.50 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
కాగా, ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ను వేలంలో ఒక్క జట్టు కూడా కొనుగోలు చేయలేదు. ఈ ప్రపంచస్థాయి బ్యాట్స్ మన్ పై ఎవరూ ఆసక్తి చూపలేదు. బంగ్లాదేశ్ నెంబర్ వన్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ కు సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. అతడు కూడా అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.