kaikala satyanarayan: నటనలో శిఖరం అయినా..కైకాలను వరించని నంది
- నటుడిగా ఒక్క నంది అవార్డూ లభించని వైనం
- 750కి పైగా చిత్రాల్లో నటించిన సత్యనారాయణ
- ఆయన ప్రతిభను గుర్తించిలేకపోయిన ప్రభుత్వాలు
కైకాల సత్యనారాయణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
కైకాల కడచూపు కోసం సీని, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కైకాల 750కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఎన్నో పాత్రల్లో అలరించారు. మూడు తరాల నటులతో కలిసి నటించారు. తన నటనతో ఎన్నో పాత్రలకు వన్నెతెచ్చిన కైకాల అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. కానీ, ఆయన నటనకు అవార్డులు, పురస్కారాల రూపంలో పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి.
1994లో ఆయన నిర్మించిన బంగారు కుటుంబం నంది అవార్డు గెలుచుకుంది. 2011లో సత్యనారాయణకు రాఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2017లో ఫిల్మ్ ఫేర్ కైకాలను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఇతర ప్రైవేటు సంస్థలు కైకాలకు పలు అవార్డులు అందించినా.. ప్రభుత్వం నుంచి ఆయనకు తగిన గుర్తింపు దక్కలేదు. నటుడిగా ఒక్కసారి కూడా నంది అవార్డు లభించలేదు. భారత ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి పౌర పురస్కారం ఆయనను వరించలేదు. అయితే, కైకాల నటనను, ఆయన ప్రతిభను పురస్కారాలతో వెలకట్టలేం. అవార్డులు గెలుచుకోలేకపోయినా ఆయన తెలుగు ప్రేక్షకుల మనసులు మాత్రం గెలుచుకున్నారు.