BJP: కరోనా ఎఫెక్ట్: రాజస్థాన్‌లో బీజేపీ ‘జన్ ఆక్రోశ్’ యాత్ర రద్దు
- చైనా సహా పలు దేశాల్లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
- రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రధాని
- ‘జన్ ఆక్రోశ్’ యాత్రను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన బీజేపీ
- ప్రజలే తమ తొలి ప్రాధాన్యమన్న అరుణ్ సింగ్
- రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్రపై విమర్శలు
చైనా, జపాన్ సహా పలు దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండడంతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు.
ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది రాజస్థాన్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ‘జన్ ఆక్రోశ్’ యాత్రను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తమ తొలి ప్రాధాన్యం ప్రజలేనని, తర్వాతే రాజకీయాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ‘భారత్ జోడో’ యాత్రపై అరుణ్ సింగ్ విమర్శలు చేశారు. రాహుల్ యాత్రను మార్నింగ్, ఈవినింగ్ వాక్‌గా ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో కాంగ్రెస్ ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన చిల్లర రాజకీయాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని సూచించారు. కాగా, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 4న రాజస్థాన్‌లో అడుగుపెట్టింది. అంతకంటే ముందే అంటే ఈ నెల 1న బీజేపీ జన్ ఆక్రోశ్ యాత్రను మొదలుపెట్టి కొనసాగిస్తోంది.