Telangana: మరో కొత్త పథకం ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం

TS govt launches  KCR Nutrition Kit

  • గర్భిణులకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ అందజేత
  • కామరెడ్డి జిల్లాలో ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
  • రూ. 1962 విలువ చేసే పౌష్టికాహారంతో కూడిన కిట్లు

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. గర్భిణుల కోసం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌ అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా గర్భిణులకు పౌష్టికాహార కిట్‌ను అందజేయాలని నిర్ణయించింది. ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పేరిట రూ.1,962 విలువ చేసే కిట్ ను గర్ఛిణులకు పంపిణీ చేయనుంది. 

కామారెడ్డి కలెక్టరేట్‌ నుంచి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలిసి కిట్ల పథకాన్ని ప్రారంభించారు. గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టడం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగడం, తల్లి ఆరోగ్యం పరిపుష్టిగా ఉండటమే లక్ష్యంగా ఈ కిట్ లకు రూపకల్పన చేసింది. బలవర్ధకమైన, పోషకాహారంతో కూడిన ఈ కిట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నది. ఒక్కొక్కరికి రెండుసార్లు ఈ కిట్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఈ కిట్లు పంపిణీ చేస్తారు.  

ఈ కిట్ లో న్యూట్రి మిక్స్ పౌడర్, ఐరన్ సిరప్, ఖర్జూరం, నెయ్యి, ఆల్బెండజోల్ మాత్ర, కప్పు ఉంటాయి. ప్రొటీన్స్‌ , మినరల్స్‌ , విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం ద్వారా రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్‌ శాతం పెంచడమే లక్ష్యంగా ఈ కిట్లకు రూపకల్పన చేశారు. మొదటి కిట్‌ను గర్భిణులకు 13-27 వారాల మధ్య, రెండోకిట్‌ను 28-34 వారాల మధ్య ఇవ్వనున్నారు. 

దాదాపు 1.25 లక్షల మంది గర్భిణులకు పథకం ఉపయోగపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.  మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముందుగా ఎక్కువ రక్త హీనత ఉన్న 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

Telangana
Government
new scheme
KCR Nutrition Kit
Harish Rao
  • Loading...

More Telugu News