Ganja: నాలుగు కేజీల గంజాయితో పట్టుబడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు

Software engineers caught with Ganja in sileru
  • అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో ఘటన
  • ఈజీమనీ కోసం అడ్డదారులు 
  • నలుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపిన పోలీసులు
  • నిందితుల్లో ఒకరిది హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ 
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు గంజాయితో పట్టుబడ్డారు. విలాసాలకు అలవాటు పడిన వీరికి వేలల్లో వస్తున్న జీతం సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు. గంజాయి సరఫరా ద్వారా మరింత సంపాదించవచ్చని భావించారు. అనుకున్నదే తడవుగా గంజాయి కొనేందుకు వచ్చి దొరికిపోయి కటకటాల పాలయ్యారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు జెన్‌కో తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు నిన్న తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కారును ఆపిన పోలీసులు అందులోని యువకులను ప్రశ్నించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు తాము హైదరాబాద్ నుంచి వచ్చినట్టు చెప్పారు. వారి మాటల్లో తొట్రుపాటును గమనించిన పోలీసులు అనుమానం వచ్చి కారును తనిఖీ చేశారు. లోపల నాలుగు కేజీల గంజాయి పట్టుబడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. గూడెం కొత్తవీధి మండలం చల్లనిశిల్పలో గంజాయి కొని హైదరాబాద్ తీసుకెళ్తున్నట్టు చెప్పారు. 

నిందితులను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గండికోట లక్ష్మీసాయి, ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, షేక్ కిజార్‌ అహ్మద్‌గా గుర్తించారు. బి.కున్నులు అనే వ్యక్తి వారికి గంజాయిని సరఫరా చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కాగా, మరొకరు బీటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వీరి నుంచి నాలుగు కేజీల గంజాయితోపాటు నాలుగు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామని, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
Ganja
Alluri Sitarama Raju District
Hyderabad
Sileru

More Telugu News