Bihar: షాకింగ్! రూ. 14 కోట్ల పన్ను కట్టాలంటూ కూలీకి ఐటీ శాఖ నోటీసులు!
- నెలకు రూ. 15 వేలు సంపాదించే కూలీకి నోటీసులు
- ఉన్న వ్యాపారాలకు గాను పన్ను చెల్లించాలని ఆదేశం
- లబోదిబోమంటున్న కూలి
నెలకు రూ. 15 వేలు సంపాదించే ఓ రోజు కూలీకి ఆదాయపన్నుశాఖ భారీ షాక్ ఇచ్చింది. బోల్డన్ని వ్యాపారాలు ఉన్నాయని పేర్కొంటూ వాటికి సంబంధించి రూ. 14 కోట్ల ఆదాయపన్ను కట్టాలని నోటీసులు జారీ చేసింది. బీహార్‌లో జరిగిందీ ఘటన. రోహ్తాస్‌కు చెందిన మనోజ్ యాదవ్ రోజు కూలీ. నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు సంపాదిస్తుంటాడు. తాజాగా తనకు అందిన నోటీసు చూసిన మనోజ్ విస్తుపోయాడు. నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించి రూ. 14 కోట్ల పన్ను చెల్లించాలని ఐటీ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
తనకు అందిన నోటీసులను చూసిన మనోజ్ కంగారుపడిపోయాడు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని వాపోయాడు. కూలి పనుల కోసం హర్యానా, ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి కాంట్రాక్టర్లు కూలీల నుంచి ఆధార్, పాన్ కార్డులను తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆ వివరాలు ఎక్కడైనా దుర్వినియోగమై ఇలా నోటీసులు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.