Chandrababu: ఛీ... మీరు పాలకులా?... సత్తెనపల్లి వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం
- కుమారుడ్ని కోల్పోయిన గంగమ్మ, పర్లయ్య దంపతులు
- రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
- అందులో సగం ఇమ్మంటున్నారన్న గంగమ్మ దంపతులు
- మున్సిపల్ చైర్ పర్సన్ భర్త, అంబటిపై ఆరోపణలు
- ఆ మేరకు ఓ పత్రికలో కథనం
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన తురకా గంగమ్మ, పర్లయ్య దంపతుల కుమారుడు ఇటీవల మరణించాడు. ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించింది. అయితే ఆ డబ్బులో సగం ఇవ్వాలంటూ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త డిమాండ్ చేస్తున్నాడని, న్యాయం కోసం మంత్రి అంబటి రాంబాబు వద్దకు వెళితే ఆయన కూడా ఇవ్వాల్సిందేనంటున్నాడని ఆ దంపతులు వాపోయారు.... ఈ మేరకు ఓ పత్రికలో కథనం వచ్చింది.
దీనిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఛీ... మీరు పాలకులా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, పత్రికలో వచ్చిన కథనం తాలూకు క్లిప్పింగ్ ను కూడా చంద్రబాబు పంచుకున్నారు.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు. మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. "నీకు మానవత్వం అనేది ఉందా? బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న తల్లిదండ్రులను పీక్కుతింటావా? పరిహారం సొమ్ములో సగం కావాలా నీకు? " అని పట్టాభి నిప్పులు చెరిగారు.