Amber Heard: అంబర్ హెర్డ్ సంచలన నిర్ణయం.. మాజీ భర్తతో రాజీ
- మాజీ భర్త జానీడెప్ తో కేసు రాజీకి నిర్ణయం
- ఒకరిపై ఒకరు వర్జీనియా కోర్టులో లోగడ వ్యాజ్యాలు
- నిజంతో ముందుకు వస్తే మహిళలు బాధితులవుతారని వ్యాఖ్య
బాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ తన మాజీ భర్త జానీ డెప్ తో ఏర్పడిన పరువునష్టం కేసును కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలన్న నిర్ణయం తీసుకుంది. తనకు అమెరికా న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయిందని వ్యాఖ్యానించింది. లోగడ ఇరువురూ ఒకరిపై ఒకరు పరువునష్టం కేసులు దాఖలు చేసుకోవడం తెలిసిందే. ఇందులో 10 మిలియన్ డాలర్లు జానీ డెప్ కు చెల్లించాలంటూ కోర్టు హెర్డ్ ను ఆదేశించగా, హెర్డ్ కు 2 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ డెప్ ను ఆదేశించింది.
దీనిపై ఇరువురూ వర్జీనియా న్యాయస్థానంలో అప్పీలు చేసుకున్నారు. కోర్టుల్లో పోరాడడం కంటే, చర్చలతో బయట రాజీకి రావాలని తాజాగా ఆమె నిర్ణయించుకుంది. దీనిపై ఇన్ స్టా గ్రామ్ లో హెర్డ్ ఓ పోస్ట్ పెట్టింది. ‘‘గొప్ప చర్చల తర్వాత నాకు వ్యతిరేకంగా మాజీ భర్త వర్జీనియా కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం కేసును పరిష్కరించుకోవాలన్న కఠిన నిర్ణయానికి వచ్చాను. వాస్తవాలను సమర్థించుకునే క్రమంలో నా జీవితం నాశనమైంది. సోషల్ మీడియాలో నేను ఎదుర్కొన్న దూషణలు.. మహిళలు వాస్తవాలతో ముందుకు వస్తే బాధితురాలిగా మిగిలిపోతారని చెప్పడానికి నిదర్శనం’’ అంటూ హెర్డ్ పెద్ద పోస్ట్ పెట్టింది.