Jagan: సమీక్ష సమావేశంలో.. 32 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్
- గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ సమీక్ష
- ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోని వారి జాబితాను అందించిన ఐప్యాక్ సంస్థ
- పద్ధతి మార్చుకోకపోతే కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతానంటూ జగన్ వార్నింగ్
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పనితీరు సరిగా లేని వారికి ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పనితీరు మెరుగు పరుచుకోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో వేటు తప్పదంటూ 32 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. వీరిలో కొందరు, మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఉండటం గమనార్హం.
ఈ 100 రోజులు పార్టీకి చాలా ముఖ్యమైనవని జగన్ చెప్పారు. పనితీరు మార్చుకోని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోనని, కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతానని అన్నారు. ఎవరినీ మార్చాలనే ఉద్దేశం తనకు లేదని... కానీ, ఆ పరిస్థితిని మీరే తెచ్చుకుంటున్నారని చెప్పారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కనీసం 10 రోజులు పాల్గొనాలని వైసీపీ ప్రజాప్రతినిధులకు గత సమావేశంలోనే జగన్ చెప్పారు. అయినప్పటికీ కొందరు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఈ కార్యక్రమంలో 10 రోజుల కంటే తక్కువగా పాల్గొన్న వారు 32 మంది వరకు ఉన్నారని ఐప్యాక్ సంస్థకు చెందిన రిషి తమ నివేదిక ద్వారా వివరించారు.
ప్రతి రోజు ఒక సచివాలయం పరిధిలో ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు పర్యటించాలని జగన్ ఇంతకు ముందు ఆదేశించారు. అయితే కొందరు గంట నుంచి రెండు గంటల సేపు మాత్రమే పర్యటిస్తూ 30 రోజులు పూర్తి చేశారు. ఇలాంటి వారి జాబితాను కూడా ఈ సమావేశంలో రిషి బయటపెట్టారు. ఇలాంటి వారు 20 మంది ఉన్నట్టుగా నివేదిక తేల్చింది. దీంతో, ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన వారిపై జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.