Thailand: శునకాలకు శిక్షణనిస్తూ.. కుప్పకూలిన థాయిలాండ్ యువరాణి

Thai Princess Bajrakitiyabha hospitalised with heart problem
  • గుండె సంబంధిత సమస్యలే కారణమని వార్తలు
  • ప్రాథమిక చికిత్స అనంతరం బ్యాంకాక్‌లోని మరో ఆసుపత్రికి తరలింపు
  • ఆరోగ్యంపై భిన్న కథనాలు
థాయిలాండ్ యువరాణి బజ్రకిటియాబా (44) తీవ్ర అస్వస్థతతో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్‌లో బ్యాంకాక్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. ఓ కార్యక్రమంలో భాగంగా పెంపుడు శునకాలకు శిక్షణ నిస్తున్న సమయంలో ఆమె కుప్పకూలిపోయారు. గుండె సంబంధిత సమస్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

మరోపక్క, ఆమె ఆరోగ్యంపై రాజకుటుంబం చేసిన ప్రకటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. యువరాణికి చికిత్స అందుతోందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని థాయ్ రాయల్ ప్యాలెస్ తెలిపింది. అయితే, సీపీఆర్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదని, ఎక్మోద్వారా ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ మొదటి భార్య సోమ్ సావాలి కుమార్తెనే బజ్రకిటియాబా. న్యాయశాస్త్రంలో పీజీ చేసిన ఆమె 2012-14లో ఆస్ట్రేలియాకు థాయిలాండ్ రాయబారిగా పనిచేశారు. దేశ న్యాయ సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. కాగా, అధికారికంగా ప్రకటించనప్పటికీ థాయ్ రాజుకు ఆమెకు కాబోయే వారసురాలిగా చెబుతున్నారు.
Thailand
Bajrakitiyabha
Hospital
Maha Vajiralongkorn

More Telugu News